- ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నెం.1గా తీర్చిదిద్దుతాం
- సంస్కరణల అమలులో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం వహించాలి
- జూన్ నాటికి సంస్కరణలు పూర్తి, అక్కడ నుంచి ఫలితాలపైనే దృష్టి
- గతప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ స్కూళ్లలో 12లక్షల మంది విద్యార్థుల తగ్గుదల
- లెర్నింగ్ ఎక్సలెన్స్, జీఓ 117 రద్దుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మంత్రి లోకేష్ సమావేశం
అమరావతి (చైతన్యరథం): అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ (లీప్), జీఓ 117 రద్దు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై కూటమి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి లోకేష్ 3గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రభుత్వ విద్యావ్యవస్థలో సమూలన ప్రక్షాళన చేసి, దేశంలోనే ఏపీ విద్యావ్యవస్థను నెం.1గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయానికి అనుగుణంగా విద్యాశాఖ మంత్రిగా తాను సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, తద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించవచ్చని తెలిపారు. విద్యావ్యవస్థ కోట్లాదిమంది జీవితాలపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో జీఓ 117 దుష్ఫలితాల గురించి అనేక మంది నాయకులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 12లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని చెప్పారు. వారంతా ప్రైవేటు స్కూళ్లవైపు మళ్లారని తెలిపారు. గత పాలకుల వైఫల్యాన్ని అసర్ నివేదిక తేటతెల్లం చేసిందని చెప్పారు.
జాతీయ సగటుకంటే క్షీణత
నేషనల్ అఛీవ్‌మెంట్ సర్వే (ఎన్‌ఏఎస్) నివేదిక ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అన్ని తరగతుల్లోనూ గణనీయమైన అభ్యాస అంతరాన్ని ఎదుర్కొంటోంది. 3వ తరగతి విద్యార్థుల్లో లాంగ్వేజెస్‌లో 57 శాతం మంది, గణితంలో 54 శాతం మంది మాత్రమే అంచనా ప్రమాణాలను చేరుకుంటున్నారు. ఇది జాతీయ సగటు కంటే 5 నుంచి 8 శాతం తక్కువ. పై తరగతుల్లో ఈ అంతరం మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని 70 శాతం జిల్లాలు జాతీయ సగటు కంటే తక్కువ పనితీరు కనబరుస్తున్నాయి. రాష్ట్రంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) నైపుణ్యాల్లో క్షీణతను అసర్ `2024 నివేదిక తెలియజేస్తోంది. 8వ తరగతి విద్యార్థుల్లో 55 శాతం మంది విద్యార్థులు కనీసం భాగాహారం కూడా చేయలేకపోతున్నారు. 10వ తరగతిలో గ్రేడ్-3 విద్యార్థుల్లో 9 మందికి ప్రాథమిక సంఖ్యా నైపుణ్యాలు కూడా లేవు. పెర్ఫార్మెన్స్ గ్రేడిరగ్ ఇండెక్స్ (పీజీఐ) 2021-22 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ విద్య శిక్షణ డొమైన్‌లో 60 పాయింట్లు సాధించింది. ఇది పెద్ద రాష్ట్రాల సగటు 66 కంటే తక్కువ. క్లాస్‌రూమ్‌ల్లో నాణ్యత మెరుగుపరచడానికి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టవలసిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని మంత్రి లోకేష్ వివరించారు.
గత ప్రభుత్వ పొరపాటును సరిదిద్దేందుకే జీఓ 117రద్దు
గత ప్రభుత్వం చేసిన పొరపాటును సరిదిద్దేందుకు జీఓ 117ను రద్దుచేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్, పాఠశాల విద్యలో స్కూల్ బ్యాగ్స్, గుడ్లు, చిక్కీలకు రూ.4,300 కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. ఎటువంటి ముందస్తు వ్యూహం లేకుండా సిబిఎస్‌ఈ, ఐబిల పేరుతో హడావిడి చేశారు. సిబిఎస్‌ఇ విధానం ప్రవేశపెట్టిన పాఠశాలల విద్యార్థులకు మాక్ టెస్ట్ నిర్వహిస్తే 90శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఐబి నివేదిక పేరుతోనే రూ.5కోట్లు దుర్వినియోగం చేశారు. పిల్లల భవిష్యత్తుతో కూడుకున్న అంశమైనందున ప్రజాప్రతినిధులంతా పాఠశాలలపై దృష్టి పెట్టాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరం కలసికట్టుగా పనిచేస్తేనే సంస్కరణల అమలు సాధ్యమవుతుంది. అంతిమంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ఫలితాలను సాధించాలి. విలువలతో కూడిన విద్యాబోధన జరగాలని మంత్రి లోకేష్ అన్నారు.
ఉత్తమ పద్ధతుల అధ్యయనానికి విదేశాలకు టీచర్లు
అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై అధ్యయనం చేసేందుకు ఎంపికచేసిన ఉపాధ్యాయులను పోలాండ్ వంటి ఇతర దేశాలకు పంపిస్తాం. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తాం. పాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నింగ్‌కు మారాలి. రాబోయే ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్, బెంచీలు, తాగునీరు, టాయ్‌లెట్లు వంటివి పూర్తిస్థాయిలో ఏర్పాటుచేస్తాం. ప్రభుత్వ నిధులతో పాటు శాసనసభ్యులు నియోజకవర్గ స్థాయిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను సమీకరించి స్కూళ్లలో సౌకర్యాల మెరుగుదలకు కృషిచేయాలి. కేవలం అకడమిక్ అంశాలపైనే గాక విద్యేతర అంశాలపై కూడా దృష్టిపెట్టాలి. స్కూలు స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు స్పోర్ట్స్ లీగ్‌లు, సైన్స్ ఫేర్‌లు నిర్వహిస్తాం. స్కూళ్లలో ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, రెడ్ క్రాస్ సేవలు వంటి వాటిలో విద్యార్థులను భాగస్వాములను చేస్తాం. గంజాయి, డ్రగ్స్ నివారణకు డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు, ఈగల్ క్లబ్బులు ఏర్పాటుచేస్తున్నాం. ప్రతి కుటుంబానికి విద్య, వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జూన్ నాటికి సంస్కరణలు పూర్తిచేసి, ఆ తర్వాత రాబోయే నాలుగేళ్లు లెర్నింగ్ అవుట్ కమ్స్ పైనే దృష్టిసారిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
జీఓ 117 కారణంగా జరిగిన నష్టాలు, ప్రత్యామ్నాయ ముసాయిదాను పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు ప్రజాప్రతినిధులకు వివరించి, వారి అభిప్రాయాలను తీసుకున్నారు. సమావేశంలో ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, స్కిల్ డెవలప్‌మెంట్ ఎండి గణేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.