- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు బాటలో కూటమి అభ్యర్థులు
- ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల స్థానంలో ఆలపాటికి భారీ మెజారిటీ
- గోదావరి జిల్లాల్లో ముందంజలో పేరాబత్తుల
- ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు గెలుపు
అమరావతి (చైతన్యరథం): ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కూటమి హవా కొనసాగింది. ఎన్నికలు జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళుతున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పోటీ చేయనప్పటికీ, టీడీపీ శ్రేణుల మద్దతుతో పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు.
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్ ముగిసేసరికి ఆలపాటి 38,612 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్‌లో ఆలపాటికి 16,286 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు 7,850 ఓట్లు వచ్చాయి.
మొదటి రౌండ్‌లో ఆలపాటికి 17,246 ఓట్లు, రెండో రౌండ్లో 17,506 ఓట్లు, మూడో రౌండ్లో 16,723 ఓట్లు చొప్పున రాగా…లక్ష్మణరావుకు మొదటి రౌండ్‌లో 7156, రెండో రౌండ్లో 6,740, మూడో రౌండ్లో 7403 చొప్పున ఓట్లు సాధించారు.
ఆలపాటి రాజా తొలి రౌండ్‌లో 10,090, రెండో రౌండ్లో 10766, మూడో రౌండ్‌లో 9320, నాలుగో రౌండ్‌లో 8436 ఓట్ల మెజారిటీ సాధించారు.
మొత్తంగా తొమ్మిది రౌండ్లు కాగా.. ఒక్కో రౌండ్లో 28వేల చొప్పున ఓట్లు లెక్కిస్తున్నారు.
గోదావరి జిల్లాల స్థానంలో..
ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏలూరు సీఆర్‌ఎర్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మొత్తంగా 243 పోస్టల్ బ్యాలెట్లకు గాను 201 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లగా.. 42 చెల్లనివిగా గుర్తించారు. ఆ తర్వాత జనరల్ బ్యాలెట్ ఓట్లలో చెల్లుబాటైనవి, కానివిగా విడదీశారు. బ్యాలెట్లను కట్టలు కట్టేందుకు 12గంటల సమయం పట్టింది.
ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తంగా 2,18,902 ఓట్లు పోల్ అవ్వగా.. మొత్తం 8 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో దాదాపు 700మంది కౌంటింగ్ సిబ్బంది మూడు షిఫ్టుల్లో పాల్గొంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
ఉత్తరాంధ్ర టీచర్ స్థానం గాదె శ్రీనివాసులుదే..
విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో దాదాపు 11గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఏపీటీఎఫ్ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. శ్రీకాకుళం- విజయనగరం-విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో పది మంది పోటీ చేయగా.. ఎనిమిది మందిని ఎలిమినేట్ చేయడంతో శ్రీనివాసులు నాయుడు విజయం ఖాయమైంది. ఉత్తరాంధ్రలో మొత్తంగా 20,783 ఓట్లకు గాను 19,813 ఓట్లు మాత్రమే చెల్లినవిగా అధికారులు గుర్తించారు. దాదాపు 1000కి పైగా ఓట్లు చెల్లనివిగా మిగిలాయి. ఈ స్థానానికి మ్యాజిక్ నంబర్ 10,068 ఓట్లుగా ఉండగా.. తొలి నుంచి ఆధిక్యంలో కొనసాగిన పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు.