అమరావతి (చైతన్యరథం): ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ మీడియా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అవాస్తవాలు, అబద్ధాలతో పబ్బం గడుపుకునే వైసీపీ లాంటి పార్టీ ఉండటం దురదృష్టకంమన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదని స్పష్టం చేశారు. శ్రీనివాసులు నాయుడు, రఘువర్మ.. ఇద్దరి అభ్యర్థిత్వాలకు టీడీపీ శ్రేణులు మద్దతు ఇచ్చాయని తెలిపారు. టీడీపీ శ్రేణులు.. శ్రీనివాసులు, రఘువర్మకు ప్రథమ, ద్వితీయ ప్రాధాన్యత ఓటు వేశారన్నారు. వాస్తవం ఇలా ఉంటే ఎమ్మెల్సీల ఎన్నికల ఫలితంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. పోటీ చేసిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ బంపర్ మెజార్టీతో గెలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. కనీసం అభ్యర్థులను కూడా పోటీలో పెట్టలేని దయనీయ స్థితిలో వైసీపీ ఉందని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.