- నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు హామీ
- విజయవంతంగా ముగిసిన సీఎం పర్యటన
జీడీ నెల్లూరు (చైతన్య రథం): చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పర్యటించారు. జీడీ నెల్లూరులో సీఎం స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులను పలకరించి పలువురితో సెల్ఫీలు దిగారు. దీనిలో భాగంగా ఓ మహిళకు పింఛను అందించిన సీఎం.. ఆమె కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలకు రూ.2 లక్షల చొప్పున ఎఫ్‌ఎ చేయాలని, వారిని సంక్షేమ పాఠశాలలో చదివించాలని అధికారులను ఆదేశించారు. సదరు మహిళ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పారు.
తొలుత జీడీ నెల్లూరు మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జీడీ నెల్లూరు మండల కేంద్రం రామానాయుడుపల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు సీఎం చంద్రబాబు శనివారం మధ్యాహ్నం 12.30కు చేరుకున్నారు. అక్కడినుంచి బీసీ కాలనీలోని కల్లుగీత కార్మికుడు వాసుకు పెన్షన్ అందించారు. వాసు కుటుంబ సమస్యలు విన్న చంద్రబాబు `ఆయన మనవరాళ్లను సంక్షేమ పాఠశాలలో చదివించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇద్దరు బాలికలకు రూ.2 లక్షల చొప్పున ఎఫ్‌ఎ చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆదేశించారు. అలాగే మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.4వేలు చొప్పున ఇద్దరికీ రూ.8 వేలు (18 ఏళ్లు నిండేవరకు బ్యాంకు ఖాతాలకు జమయ్యేలా) ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఇక, కుటుంబ జీవనోపాధి నిమిత్తం ఆవుల పెంపకానికి ఆర్థిక సాయం చేయాలన్న లబ్దిదారుడి భార్య విజ్ఞప్తికి స్పందించిన సీఎం.. తగురీతిన సాయం చేస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రభుత్వ విప్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్, ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్, కె మురళీమోహన్, సెర్ప్ సీఈఓ కరుణ తదితరులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. అక్కడినుంచి హరిజనవాడకు చేరుకున్న సీఎం చంద్రబాబు… అక్కడ లబ్దిదారు వసంతమ్మకు పెన్షన్ అందించారు. అక్కడినుంచి ప్రజావేదికకు హాజరైన చంద్రబాబు ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అనంతరం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి పనుల నిర్మాణంలో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.30.5 కోట్లతో చేపట్టనున్న పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను చంద్రబాబు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లా నీటి యజమాన్య సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్‌లో హార్టికల్చర్ ప్లాంటేషన్ ఫారం పాండ్, స్త్రీనిధి జీవనోపాధి, లక్ పతి దిది (లక్షాధికారి), ఉన్నతి (ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్) వడ్డీ లేని రుణం, బ్యాంకు లింకేజీ- లబ్ధిదారు, బహుళ వ్యాపారవేత్త, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాలను, జిల్లా గృహ నిర్మాణ శాఖ ఇండ్ల పురోగతికి సంబంధించి వివరాలను సందర్శించారు. అలాగే, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, పట్టు పరిశ్రమల శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో.. రాష్ట్రీయ గోకుల్ మిషన్, సేద్యంలో డ్రోన్‌ల వినియోగం, అధిక ప్రోటీన్ విలువలున్న వరి రకాలు, స్కిల్ ఆఫ్ డిజిటల్ ట్రైనింగ్‌లను పరిశీలించారు. అనంతరం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్టాల్, స్కిల్లింగ్ `ఎంప్లాయిమెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్ `హెచ్‌ఆర్‌డి స్టాల్, వాటర్ సెక్యూరిటీ, స్వచ్ఛ ఆంధ్ర, కాస్ట్ ఆప్ట్ మిషన్ తదితర స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. ప్రభుత్వ విప్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే విఎం థామస్ నిధులతో సమకూర్చిన ఎనిమిది ఆటోలను సీఎం చేతులమీదుగా లబ్దిదారులకు అందచేశారు. అక్కడినుంచి ప్రజావేదిక కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు `గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదేనని ప్రజానీకానికి హామీ ఇచ్చారు. ప్రజా వేదిక కార్యక్రమం అనంతరం రోడ్డు మార్గాన రామానాయుడుపల్లికి చేరుకున్న సీఎం.. అక్కడ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తల సమావేశం అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అక్కడి నుంచి ఉండవల్లికి బయలుదేరారు. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, అధికారులు, ప్రజలు పెద్దఎత్తున వీడ్కోలు పలికారు.