అమరావతి (చైతన్యరథం): విశాఖలోని రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా ఉపసంహరించిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తక్షణమే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా విశాఖలోని రుషికొండకు పేరుంది. రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్ బీచ్ గా 2020లో ధ్రువీకరించారు. ఈ గుర్తింపును డెన్మార్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో బీచ్ నిర్వహణ వివాదాస్పదమైంది. 2018లో టీడీపీ ప్రభుత్వంలో రూ.7 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో తీరంలో మౌలిక వసతులు కల్పించారు. ఆ పనులు చేసిన సంస్థే కొద్దిరోజులు నిర్వహణను చేపట్టింది. తర్వాత చాలాకాలం ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ బీచ్‌ను నిర్వహించింది. రెండేళ్ల క్రితం నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించేశారు. ప్రైవేటు సంస్థ తగిన సిబ్బందిని నియమించక ప్రమాణాల్ని గాలికొదిలేసింది. బీచ్‌లో నిర్వహణ ప్రమాణాలు దిగజారటంతో డెన్మార్క్ సంస్థకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో బ్లూ ఫాగ్ గుర్తింపును ఆ సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిని కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు అధికారులు స్పందించారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను రద్దు చేయలేదని, తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశారని తెలిపారు. సేఫ్టీ ప్రోటోకాల్స్ అప్‌డేట్ చేయాలని.. బ్లూఫ్లాగ్ ఫౌండేషన్ సూచించిందన్నారు. 2 రోజుల్లో ఆడిట్ తర్వాత బ్లూ ఫాగ్ హోదా పునరుద్ధరిస్తారని తెలిపారు.