- సీఐడీ మాజీ చీఫ్ సస్పెన్షన్
- నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పర్యటనలు
- సీఐడీ డీజీగా అనేక అడ్డగోలు పనులు
- కస్టడీలో రఘురామకు చిత్రహింసల కేసులో కీలక సూత్రధారి
- అక్రమ అరెస్ట్‌లు, కస్టడీలో టార్చర్ పనితీరుగా మార్చుకున్న ఘనుడు
- బాధితుల్లో టీడీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు
అమరావతి (చైతన్యరథం): జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఐపీఎస్ అధికారిని అన్న సంగతిని మర్చిపోయి వైసీపీకి సేవ చేసి ఘోరమైన తప్పులకు పాల్పడిన వై (ఐ)పీఎస్ అధికారి, సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చట్టాలను లెక్కచేయకుండా, ఆనాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా నడుచుకుని ఐపీఎస్ పదవి ముసుగులో అనేక అరాచకాలకు కేంద్ర బిందువుగా నిలిచారని సునీల్‌కుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుండి ఆయనకు పోస్టింగ్ లేదు. పలు అంశాల్లో ఆయన చేసిన నేరాలపై విచారణ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేసినట్లుగా గుర్తించారు. ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేకుండా పలుమార్లు విదేశీ పర్యటనలు చేసినందుకుగాను ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్‌కుమార్ సీఐడీ చీఫ్‌గా సమయంలో 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం.. అదే విధంగా విదేశాలకు వెళ్లే సమయంలో కొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ ప్రయాణ ప్రణాళికలకు విరుద్ధంగా వేరే దేశాలకు వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు నిర్ణారణ కావడంతో సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విదేశీ ప్రయాణానికి వెళ్లే ఐపీఎస్ అధికారులు ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇది పరిపాలనా బాధ్యతను నిర్ధారించడంతో పాటు భద్రతా పరమైన సమస్యలను నివారించేందుకు అవసరం. పోలీస్ శాఖలో క్రమశిక్షణ అత్యంత ప్రాముఖ్యమైనది. అధికారి అనుమతి లేకుండా విదేశీ ప్రయాణం చేయడం నిబంధనలకు వ్యతిరేకం. ఐపీఎస్ అధికారి విదేశాలకు అనుమతి లేకుండా వెళ్లడం వల్ల రహస్య సమాచారం, నిఘా నివేదికలు, విచారణల గురించిన అంశాలు బయటకు పొక్కే ప్రమాదం ఉంది. దీనిని జాతీయ భద్రతకు విఘాతం కలిగించే చర్యగా పరిగణిస్తారు. సస్పెన్షన్ కాలంలో ఆయన ప్రధాన కార్యాలయం విజయవాడగా నిర్ణయించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వీడిచి వెళ్లరాదని ఆదేశించారు.
విచారణలో వెల్లడయిన అంశాలు
2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని, ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారానికి విరుద్ధంగా దుబాయ్‌లో సునీల్ కుమార్ పర్యటించారు.
2023 సెప్టెంబర్ 2వ తారీఖున ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం జుఖ 525 లో హైదరాబాద్ నుండి స్వీడన్ దేశం వెళ్లి 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం జుఖ 526లో హైదరాబాద్ తిరిగివచ్చారు. 2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నుండి జుఖ 525 విమానం లో దుబాయి మీదగా అమెరికా వెళ్లి 2023 ఫిబ్రవరి 28 న జుఖ 524 విమానంలో అమెరికా నుండి హైదరాబాద్‌కు దుబాయ్ మీదగా తిరిగి వచ్చారు. అయితే ఈ పర్యటనకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. 2022 డిసెంబర్ 14 నుండి 19 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్‌లో పర్యటించారు. 2021 అక్టోబర్ 2న జుఖ 525 విమానంలో హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లి అక్టోబర్ 10 న జుఖ 524 విమానంలో తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేదు. 2019 డిసెంబర్ 21 నుండి 2020 జనవరి 4 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతి తీసుకుని అనుమతులకు విరుద్ధంగా యునైటెడ్ కింగ్డమ్ లో పర్యటించారు.
ఇలా పలుమార్లు ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించి, ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా కొన్నిసార్లు విదేశీ పర్యటనలు చేసిన నేపథ్యంలో సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఐపీఎస్ అధికారి ఇంత రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటో, ఎవరి పనులను చక్కబెట్టేందుకు వెళ్లారో తేలాల్సి ఉంది.
విదేశీ పర్యటనలతో పాటు సునీల్ కుమార్‌పై పలు తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ ఆ పార్టీ నేతల కంటే ఎక్కువగా జగన్‌కి వీర విధేయుడుగా పనిచేశారు. నాడు నరసాపురం ఎంపీగా ఉన్న ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిన సమయంలో సునీల్ కుమారే సీఐడీ చీఫ్‌గా ఉన్నారు. సునీల్ ఆధ్వర్యంలోనే రఘురామను కప్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. తనకు సన్నిహితంగా ఉన్న కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తిని సీఐడీ కార్యాలయానికి సునీల్ పిలిపించి, రఘురామ గుండెలపై కూర్చోబెట్టి ఆయనను చంపేసేందుకు యత్నించారన్న ఆరోపణలు కూడా సునీల్ పై ఉన్నాయి. అంతకుముందు కూడా సునీల్ కుమార్ పలు అరాచకాలకు పాల్పడ్డారు. చాలా మందిని నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా దగ్గరుండి అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ వృద్ధులను, టీడీపీ నాయకులను, చివరికి మహిళలను కూడా అడ్డగోలుగా అరెస్ట్ చేసి, తీవ్రంగా హింసించారు. ఇక ఐపీఎస్ అధికారిగా ఉంటూనే ఓ మతాన్ని ప్రమోట్ చేస్తూ సునీల్ పలు పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారు. ఈ విషయంపైనా గతంలోనే పలు వివాదాలు రేగాయి. ఇన్నేసి వివాదాల నేపథ్యంలో సునీల్ పై సస్పెన్షన్ వేటు పడటం గమనార్హం.