అమరావతి (చైతన్యరథం): ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం ఖాయమని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం సాయంత్రం పార్టీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆలపాటి మాట్లాడుతూ 69 శాతానికి పైగా ఓటింగ్ జరగడంపై హర్షం బులిబుచ్చారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోంది కాబట్టే పట్టభద్రులు తనకు ఘన విజయాన్ని అందించబోతున్నారని ఆలపాటి రాజా అన్నారు. ప్రత్యర్థులెవరనేది కాదు ప్రగతికి ఓటేయాలని తాము నినదించామని చెప్పారు. ఎన్నికల్లో తనకు సహకరించిన కూటమి నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పర్చూరి అశోక్ బాబు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.