- తొమ్మిది గంటలు విచారణ
- పోలీసు అధికారులకు సహకరించని పోసాని
- రైల్వేకోడూరు మేజిస్ట్రేట్ ముందు హాజరు
ఓబులవారిపల్లె (చైతన్యరథం): వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో తొమ్మిది గంటలకు పైగా పోసానిని అధికారులు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి రైల్వేకోడూరు కోర్టుకు తరలించి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణకు పోసాని సహకరించలేదని అధికారులు తెలిపారు. ఏ ప్రశ్న అడిగినా.. తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా అంటూ సమాధానాలు దాటవేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియోలను ముందు పెట్టి ప్రశ్నించినా.. పోసాని సమాధానం ఇవ్వకుండా తన శైలిలోనే ప్రవర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఆరోగ్య సమస్యలు లేవు
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో మై హోమ్ భూజా అపార్ట్‌మెంట్‌లో బుధవారం రాత్రి పోసానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరుగా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషనకు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యుడు గురుమహేష్ ఆధ్వర్యంలో పోసానికి వైద్యపరీక్షలు నిర్వహించారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ గురుమహేష్ తెలిపారు. పోలీసు విచారణకు ఆరోగ్య సమస్యలు ఎదురుకావని పేర్కొన్నారు. ఆయన స్టేట్మెంట్‌ను రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. మరో వైపు పోసాని కృష్ణమురళిని కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నాగిరెడ్డి.. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు రాగా.. పోలీసులు అనుమతించలేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా లోపలికి పంపలేమని సీఐ చెప్పడంతో ఆయన వెనుదిరిగారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోసానిని చూడాలని పట్టుబట్టారు. తమ విధులకు ఆటంకం కలిగించవద్దని పోలీసులు హెచ్చరించడంతో వెనుదిరిగారు.
సినీ పరిశ్రమలో వర్గవిభేదాలు తలెత్తేలా, ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి రెండు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై బీఎన్‌ఎస్ లోని 196, 353(2), 111 రెడ్విత్ 3(5) సెక్షన్ల కేసు నమోదైంది. దీనిలోనే పోలీసులు పోసానిని అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండదండలు, ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా నాటి ప్రతిపక్షంలోని ముఖ్యులు, వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలం, బూతులతో పోసాని కృష్ణమురళి పేట్రేగిపోయారు.