- మేము విడిపోతే ప్రజలకు ద్రోహం చేసినట్లే
- బూతులు, గొడవలకు పర్యాయపదంగా వైసీపీ నేతలు
- వీళ్లను తట్టుకుని నిలబడ్డ చంద్రబాబుకు హ్యాట్సాఫ్
- వైసీపీ తీరుపట్ల గవర్నర్‌కు క్షమాపణలు చెబుతున్నాం
- శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్
అమరావతి (చైతన్యరథం): వైసీపీ నేతలు గొడవలు, బూతులకు పర్యాయపదంగా మారిపోయారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో వైౖసీపీ నేతల విధ్వంసం చూస్తే.. వివేకా హత్య గుర్తొచ్చిందని అన్నారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు అలా ప్రవర్తించవచ్చా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా మంగళవారం పవన్ మాట్లాడారు. ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు ఎలా తట్టుకుని నిలబడగలిగారా అని.. సోమవారం నాటి ఘటన తర్వాత నాకనిపించింది. ఆయనకు హ్యాట్సాఫ్.. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యం, తెగువ ఉండాలి. సభలో గొడవ చేసిన వైసీపీ నేతలు .. గవర్నర్ ఇదే .. సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కళ్లలోకి చూడగలిగేవారా అని పవన్ ప్రశ్నించారు. చట్టాలు చేయాల్సిన వారే వాటిని ఉల్లంఘిస్తే ఎలా? సభలో గొడవ చూస్తుంటే. వైసీపీ విధ్వంస విధానాలు గుర్తొచ్చాయి. ప్రజావేదిక కూల్చివేసిన తీరు, 200 పైచిలుకు ఆలయాలు కూల్చివేత, డాక్టర్ సుధాకర్ చనిపోయిన విధానం, జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలు, సుప్రీంకోర్టు జడ్జికి వ్యతిరేకంగా లేఖ రాయడం, హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం, పత్రికాధిపతులపై దాడులు, మడ అడవుల విధ్వంసం, చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టిన విధానం, అమరావతి రైతులను రక్తం వచ్చేట్టు కొట్టి, కేసులు పెట్టిన తీరు, తిరుపతి కల్తీ లడ్డూ ఘటనలు గుర్తొచ్చాయి. అసెంబ్లీలోనే ఈ స్థాయిలో ప్రవర్తిస్తే.. బయట కూడా ఇలాంటి గొడవలే జరుగుతాయి. ఈ అరాచకాని ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే ప్రజలు మనల్ని అత్యధిక మెజార్టీతో ఇక్కడ కూర్చోబెట్టారని పవన్ అన్నారు.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసే ఉంటాం..
సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. 15ఏళ్ల పాటు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది. మేం కలిసి లేకుంటే ప్రజలకు ద్రోహం చేసినట్టే. మమ్మల్ని అగౌరవ పరిచేలా మాట్లాడినా కలిసే ఉంటాం. గవర్నర్‌కి గౌరవం ఇవ్వని పార్టీ ఈ సభలోకి రాకూడదని అని పవన్ స్పష్టం చేశారు.
ఎన్డీఏ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతల తీరుపట్ల.. గవర్నర్‌కు మేం క్షమాపణలు చెబుతున్నాం. మా తప్పు లేకున్నా గవర్నర్‌కు క్షమాపణలు చెబుతున్నాం. గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిరది. వారి హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయి. మీ హయాంలో ఒకే రోజు 13,326 గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 1800 కి.మీ సీసీ రోడ్లు వేసింది. మా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 4వేల కి.మీకు పైగా సీసీ రోడ్లు వేశాం. 22వేలకు పైగా గోకులాలు నిర్మించాం.
గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులు దుర్వినియోగం చేసింది. వైసీపీ హయాంలో అటవీశాఖమంత్రి 77 ఎకరాల అటవీభూమి ఆక్రమించారు. రాష్ట్రంలో ఎర్రచందనం కొట్టి తరలిస్తుంటే కర్ణాటక అటవీ అధికారులు పట్టుకున్నారు. ఆ ఎర్రచందనం వేలం వేస్తే కర్ణాటకకు రూ.185 కోట్ల ఆదాయం వచ్చింది. సీఎం చంద్రబాబు కృషి వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించుకున్నాం. గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాట్లు వేసేందుకు సిద్దపడిరదని పవన్ విమర్శించారు.