- ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే అసెంబ్లీకి రావాలి
- లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
- మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్
అమరావతి (చైతన్యరథం): ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ రెడ్డి అవమానిస్తున్నారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సయిజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సోమవారం జగన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గత ఐదేళ్లు అధికారంలో ఉండి జగన్ రెడ్డి విధ్వంస, అరాచక పాలన సాగించారు. జగన్ రెడ్డి అవినీతి, అరాచక పాలనపై విసిగిపోయి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సింది పోయి… ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల పక్షాన నిలబడతామని చెప్పడం సిగ్గు చేటు. ప్రతిపక్ష హోదా అడగడానికి మాత్రమే అసెంబ్లీకి రావడం చట్ట సభల్ని కించపరచడమే. గత ఐదేళ్లు టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామని జగన్ రెడ్డి మాట్లాడిన మాటలు మరిచిపోయారా? గత ఐదేళ్లు మీరు ఎన్ని అరాచకాలకు పాల్పడినా, ఇబ్బందులకు గురి చేసినా టీడీపీ నేతలు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై పోరాడారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు అనే విషయం కూడా తెలియకుంటే ఎలా? ఓట్లేసి గెలిపించిన ప్రజలు, ఎంఎల్‌ఏగా అవకాశం కల్పించిన ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే జగన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి. ప్రజాతీర్పుని గౌరవించను అంటే ఎంఎల్‌ఏ పదవికి రాజీనామా చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.