- ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు
- గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే యత్నం
అమరావతి (చైతన్యరథం): అనర్హత వేటు పడకుండా అసెంబ్లీలో హాజరు వేయించుకున్న జగన్ సహా ఎమ్మెల్యేలు పదకొండు నిమిషాల్లో అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు సోమవారం గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టిన కొన్ని క్షణాలకే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో నినాదాలు మొదలుపెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు చివరికి తమ డ్రామాకు తెరదింపి గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగానే సభనుంచి వాక్ అవుట్ చేసారు. పదో నిమిషంలో అందరూ బయటకు వెళ్లిపోయారు. జగన్ కూడా వారితో పాటు వెళ్లిపోయారు.మొత్తంగా అసెంబ్లీలో పదకొండు నిమిషాల పాటు గడిపారు. ఉభయసభల సమావేశం కావడంతో బొత్స సత్యనారాయణ, జగన్ పక్క పక్కనే కూర్చున్నారు. శాసనమండలిలో బొత్సకు ప్రతిపక్ష నేత హోదా ఉంది. జగన్‌కు లేదు. అందుకే బొత్స మిగతా ఎమ్మెల్యేలతో పాటు ముందుకు వెళ్లి నినాదాలు చేయలేదు. అయితే అందరితో పాటు బయటకు వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్‌పై తాము వాకౌట్ చేస్తున్నట్లుగా ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. వైసీపీ వ్యవహారం చూసి జనం కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. ఏదైనా ప్రజాసమస్య కోసం ఇలా చేసినా కాస్తంత గౌరవం ఉండేదమో కానీ..లేని.. ప్రజలు ఇవ్వని గౌరవం కోసం జగన్ ఇలా మిగతా వారిని ఉపయోగించుకోవడం ఆశ్చర్యకరంగా మారింది.
వై నాట్ 175 అంటూ.. ఐదేళ్ల తన విధ్వంసకర పరిపాలనతో పేట్రేగిపోయిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదాలో కూర్చునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించకుండా తన స్వార్ధ బుద్ధిని మరోసారి రుజువు చేసుకున్నాడు. అసెంబ్లీకి వెళ్తున్నట్లు ఫోటోలు, వీడియోలకు ఫోజులు ఇచ్చిన జగన్ రెడ్డి అండ్ కో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కనీసం 10నిమిషాలు కూడా వినడానికి ఇష్టపడలేదు అంటే…ప్రజలకు జరుగుతున్న మంచిని తాను జీర్ణించుకోలేకపోతున్నాడని స్పష్టంగా రుజువు చేశాడు.
11 సీట్లు అతి కష్టం మీద గెలిచిన జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా ప్రతిపక్ష హోదా కావాలని అసెంబ్లీలో, కోర్టుల్లో చేసే హడావుడి చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. చేతిలో 151 సీట్లు ఉండగా ప్రజల యోగక్షేమాలను గాలికొదిలేసిన జగన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహ సునామీలో కొట్టుకుపోయి 11 సీట్లకు పరిమితమయ్యాడు. ప్రజలు మనల్ని ఛీ కొట్టారు…కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా మా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు…అని స్పష్టమైన తీర్పు ఇచ్చారనే ఇంగిత జ్ఞానం జగన్ రెడ్డికి నేటికీ రాలేదంటే…ఎంత మూర్ఖుడో అర్థమవుతుంది. తాను అధికారంలో ఉండగా కనీసం 10శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని చిలకపలుకులు పలికిన జగన్ రెడ్డి….నేడు 11 సీట్లు జేబులో వేసుకొచ్చి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని కాకి అరుపులు అరవడం ప్రజాస్వామ్యాన్ని, ప్రజల దేవాలయం అసెంబ్లీని అగౌరవపర్చడం కాక మరేమిటి?
ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవంతో భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ అటల్ బిహారీ వాజ్ పేయీ వంటి అగ్రనాయకులు ప్రజావాణిని చట్టసభల్లో వినిపించిన దాఖలాలు లేకపోలేదు. ఏపీ అసెంబ్లీలో వెంకయ్యనాయుడు, జయపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి గొప్ప నేతలు ప్రజా సమస్యలను సమర్థవంతంగా సభ దృష్టికి తెచ్చిన పరిస్థితులు ఉన్నాయి.
కానీ జగన్ రెడ్డి తన వితండవాదనతో ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో మాట్లాడతాననడం తనను నమ్మిన ప్రజలను వంచన చేయడమే. తనతోపాటు తన పార్టీ సింబల్ మీద గెలిచిన మరో 10మంది వైసీపీ ఎమ్మెల్యేలను సైతం చట్టసభల్లో తమను నమ్ముకున్న ప్రజల సమస్యలపై మాట్లాడనీయకుండా వివక్షపూరితంగా అసెంబ్లీకి దూరం చేస్తున్నాడు. ఇలాంటి ప్రజా ద్రోహి జగన్ రెడ్డికి ప్రజల గురించి నోరెత్తే నైతిక హక్కు లేదు అని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. వేర్వేరు ఘటనల్లో రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను అని చెప్పే జగన్ రెడ్డి…అసెంబ్లీలో తనకు వచ్చే అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి 2019-24 మధ్య ఆడిన డ్రామాలు ఇప్పుడు చెల్లడంలేదని తెలుసుకుని అసెంబ్లీలో తమ సభ్యత్వాలను కాపాడుకోవడం కోసం అటెండెన్సు వేసుకుని, సభలో కాసేపు హడావుడి చేసి పారిపోయాడు. ఇలాంటి బాధ్యత లేని జగన్ రెడ్డి అండ్ కో ప్రజాక్షేత్రంలో పని చేయరు…వాళ్లకు ప్రజల గురించి మాట్లాడే అర్హత, హక్కు రెండూ లేవు అని గుర్తుపెట్టుకోవాలి.
బెడిసికొట్టిన ఎత్తుగడ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు శాసనసభకు హాజరై తన శాసనసభ సభ్యత్వంపై వేలాడుతున్న అనర్హత వేటును తప్పించుకుందామని భావించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టిందా.. అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. అటు అసెంబ్లీకి అయినా, ఇటు శాసన మండలికి అయినా సభ్యులుగా ఎన్నికైన వారు వరుసగా 60 రోజుల పాటు సభా సమావేశాలకు హాజరు కాకుంటే వారిపై అనర్హత వేటు తప్పదన్న నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. సభకు రాని వైసీపీ సభ్యులతో పాటుగా ఆ పార్టీ అధినేత జగన్ పైనా అనర్హత వేటు తప్పదంటూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవి కాపాడుకునే ఉద్దేశంతో జగన్.. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు సభలో ఉన్న వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత పార్టీ సభ్యులతో భేటీ అయిన జగన్.. ప్రధాన ప్రతిపక్షం ఇవ్వని సభకు ఇక వెళ్లబోమని తీర్మానం చేశారు. ఇకపై ప్రజల్లోనే ఉంటూ పోరాడదాం అంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
అయితే.. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అటు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం అయినా, ఇటు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అయినా.. అది సంప్రదాయం (కస్టమరీ) మాత్రమే.. దీనికి హాజరయ్యే సభ్యుల హాజరును పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. ఈ లెక్కన సోమవారం సభకు వచ్చిన వైసీపీ సభ్యుల హాజరు పరిగణనలోకి రాదు. మంగళవారం నాటి సమావేశాలకు వచ్చి రిజిష్టర్లలో సంతకం చేస్తేనే.. సభకు హాజరైనట్టు అవుతుందని చెబుతున్నారు. దీంతో సోమవారం గవర్నర్ ప్రసంగానికి హాజరై అనర్హత వేటు నుంచి తప్పించుకుందామన్న జగన్ ప్లాన్ బెడిసికొట్టినట్లే. మంగళవారం సభకు వస్తేనే ఆయన హాజరు పరిగణలోకి తీసుకుంటారు.