- 2047నాటికి స్వర్ణాంధ్ర సాకారం
- పదిమార్గ దర్శక సూత్రాలతో పయనిస్తున్నాం
- 8 నెలల పాలనలో సాధించిన విజయాలెన్నో
- గత ప్రభుత్వ వినాశనాలను అధిగమించాం
- నిరుపేదరహిత సమాజావిష్కరణ లక్ష్యం
- ఉపాధి, నైపుణ్యంతో మానవ వనరు అభివృద్ధి
- నీటి భద్రతకు పక్కా ప్రణాళికలు అమలు
- రైతు -వ్యవసాయ సాంకేతికతతో ప్రగతి ఫలితాలు
- ప్రపంచ ఉత్తమ వ్యూహరచనలు ఏపీలో అమలు
- వ్యయ నియంత్రణ, విద్యుత్ `ఇంధనంపై దృష్టి
- స్వచ్ఛాంధ్ర, సుపరిపాలన, పౌరుల రక్షణకు చర్యలు
- లక్ష్యాన్ని చేరేవరకూ విశ్రమించేది లేదు…
- ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ పిలుపు
- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ సెషన్స్
- 11 నిమిషాల్లో పలాయనం చిత్తగించిన వైసీపీ
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. తొలుత అప్రతిహత విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ.. ఎనిమిది నెలల కాలంలోనే సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు. 2025-26 బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభల ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం తనకు దక్కిన గౌరవంగా ప్రకటించుకున్న గవర్నర్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల నాయకత్వంపట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుతూ.. ఎన్టీయే సంకీర్ణ ప్రభుత్వ సంపూర్ణ మద్దతు ప్రతిబింబిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాసనసభ ఎన్నికలలో తన ప్రభుత్వానికి అపూర్వమైన తీర్పునిచ్చారని వెల్లడిరచారు. కూటమి ప్రభుత్వానికి లభించిన అఖండ, చారిత్రాత్మక మెజారిటీ ప్రజా సంకల్పానికి నిదర్శనం మాత్రమే కాదని, గత ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా బలమైన ప్రకటన కూడానని గవర్నర్ వ్యాఖ్యానించారు.
‘‘ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం. మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేశాం. అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నాం. కూటమి వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది. అవకాశాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నాం. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నాం. విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం. 2047నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం. బీసీ వర్గాలు సమాజానికి వెన్నెముక. వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేదే మా ఆకాంక్ష’’ అని ప్రభత్వ పాలనా విధానాన్ని, ఆకాంక్షలను విస్పష్టంగా వెల్లడిరచారు.
‘గత ప్రభుత్వంలో అన్నిరంగాల్లో జరిగిన దుర్వినియోగం వల్ల మనం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితిని ఇదే సభలో గతంలో చేసిన ప్రసంగాన్ని సభ దృష్టికి తెస్తున్నాను. గత ఐదేళ్లలో (2019-24) జరిగిన దుర్మార్గపు పాలన రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచుకు చేర్చింది. గత ప్రభుత్వంవల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశాను. ఈ శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దుర్వినియోగాన్ని బయటపెట్టాయి. రాష్ట్ర వనరుల మళ్లింపు, సహజవనరుల దోపిడీ, ఎక్సైజ్, ఇసుక తవ్వకాల్లో లోపభూయిష్ట విధానాలతో రాష్ట్ర ఆదాయానికి గండిపడటం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా 25 ఏళ్ల భవిష్యత్తు ఆదాయాన్ని కోల్పోవడం, అధిక రుణస్థాయి మరియు అధిక వడ్డీరేట్లకు రుణాలు తీసుకోవడం, భారత ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలు తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకం నిధుల మళ్లింపు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం, ఇంధన రంగం విధ్వంసం, రూ.1.35 లక్షల కోట్లమేర అప్పులు ఉన్నాయి’ అని గవర్నర్ నజీర్ వెల్లడిరచారు.
‘అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి దార్శనిక నాయకత్వంలో నా ప్రభుత్వం ఆరు హామీలను అమలు చేసేందుకు, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర పునరుజ్జీవనం కోసం నిరంతరం కృషి చేస్తూ బ్రాండ్ ఆంధ్ర పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడం ప్రారంభించింది. మొదటి కొద్ది రోజుల్లోనే, మేము వాగ్దానాలను నెరవేర్చడానికి మరియు ప్రజల జీవితాలలో స్పష్టమైన మెరుగుదలను తీసుకురావడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నాము. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రతా పింఛన్లను రూ.4,000లకు పెంచడం, విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం 16,347 మంది ఉపాధ్యాయుల నియామకానికి మెగా డిఎస్సీని ప్రకటించడం, ఉపాధి అవకాశాలను అంచనా వేయడానికి మరియు పెంచడానికి నైపుణ్య గణన నిర్వహించడం, 204 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, గుంతలులేని రోడ్ల కోసం మిషన్, ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు.. ఇందులో భాగమే’ అన్నారు.
‘గత దుర్భలపాలన, దుష్పరిపాలన నుంచి బాధ్యతాయుతమైన, సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో గత ఎనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 74 పథకాలను పునరుద్ధరించి రూ.9,371 కోట్ల అప్పులు తీర్చాం. ఇది ప్రస్తుత మరియు భవిష్యత్తు సంవత్సరాలకు భారత ప్రభుత్వం నుండి మరిన్ని విడుదలకు ప్రేరేపించింది. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌పై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి నీటిపారుదల, రోడ్లు, ఇతర పనులకు సంబంధించి రూ.10,125 కోట్ల బిల్లులను క్లియర్ చేశాం. దీర్ఘకాలంగా పెండిరగ్‌లోవున్న రూ.2,488 కోట్ల ఆర్థిక సంఘం గ్రాంట్లను విడుదల చేయడం ద్వారా స్థానిక పాలనను బలోపేతం చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి నిర్మిస్తామని ఇటీవల శాసనసభ ఎన్నికలలో ఎన్డీయే హామీ ఇచ్చినట్లుగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు, అమరావతి రాజధాని ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించాం. విశాఖ ఉక్కు కర్మాగారం పునరుద్ధరణ, కొత్త రైల్వే జోన్ ఏర్పాటు హామీలను నెరవేర్చాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనం. సుస్థిర వృద్ధి, శ్రేయస్సుకు దోహదపడే 22 కొత్త విధానాలను ప్రారంభించడం ద్వారా బలమైన పునాది వేశాం’ అని గవర్నర్ నజీర్ ప్రకటించారు.
కందుకూరి వ్యాఖ్యలను ప్రస్తావించిన గవర్నర్
బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ కందుకూరి వీరేశలింగం వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘‘ప్రతి వ్యక్తిలో ప్రతిభ ఉంటుంది. అవకాశమిస్తే బయటకు వస్తుంది. సమాజాభివృద్ధికి సంక్షేమం, అభివృద్ధి కలిసికట్టుగా వెళ్లాలి. మా ప్రభుత్వం గత ఎనిమిది నెలల్లోనే గణనీయమైన పురోగతి సాధించింది. 22 కొత్త విధానాల ద్వారా సుస్థిర వృద్ధికి బాటలు వేశాం. పోలవరం, అమరావతి మళ్లీ పట్టాలెక్కించాం. విశాఖ ఉక్కు పరిరక్షణ, రైల్వే జోన్ ఏర్పాటు హామీలు నెరవేర్చాం. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టాటా పవర్, గ్రీన్ కో గ్రూప్, బీపీసీఎల్, టీసీఎస్ కంపెనీలకు ఆకర్షించాం. ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు రూ.6.5 లక్షల కోట్ల పెట్టబడులు పెట్టారు. ఆయా పెట్టుబడుల ద్వారా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ.16 లక్షల కోట్లకు విస్తరించింది. తలసరి ఆదాయం కూడా రూ.2.68 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలో ఐటీ విప్లవానికి సీఎం శ్రీకారం చుట్టారు. అమెరికాలోని ప్రవాస తెలుగువాళ్ల తలసరి ఆదాయం ఎక్కువ. ప్రస్తుతం ఏపీ మరో విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. పరిపాలన, పరిశ్రమలు, ఆర్థిక వృద్ధిలో ఏఐను వినియోగిస్తున్నాం. పీపుల్ ఫస్ట్ విధానంతో స్వర్ణాంధ్ర సాధనకు సమగ్ర రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేశాం. దేశంలోనే తొలిసారిగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాం. తల్లులకు చేయూతనిస్తూ ‘తల్లికి వందనం’ అమలు చేయబోతున్నాం’’ అని గవర్నర్ వెల్లడిరచారు.
పది మార్గదర్శక సూత్రాలు..
స్వర్ణాంధ్ర `2047 సుభిక్ష భవిష్యత్తు కోసం దార్శనికతను నిర్వచించే పది మార్గదర్శక సూత్రాలను కూటమి ప్రభుత్వం రూపొందించింది. సంపూర్ణ పేదరికం నిర్మూలన, మానవ వనరుల అభివృద్ధి `జనాభా నియంత్రణ, నైపుణ్యం పెంపుదల మరియు ఉపాధికల్పన, నీటి భద్రత, రైతు-అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ, విద్యుత్ `ఇంధనం, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛాంధ్ర, విస్తృత సాంకేతికత ఏకీకరణగా పది మార్గదర్శక సూత్రాలను పేర్కొన్నారు.
స్వర్ణాంధ్ర `2047
వికసిత్ భారత్ దార్శనికతతో నా ప్రభుత్వం ‘పీపుల్ ఫస్ట్’ విధానంతో స్వర్ణాంధ్ర `2047 సాధనకు సమగ్ర రోడ్ మ్యాప్‌ను అమలు చేస్తోంది. 15శాతం వృద్ధి రేటుపై దృష్టి సారించడం ద్వారా 2047నాటికి, వందేళ్ల స్వతంత్ర భారతదేశానికి గుర్తుగా ‘సంపన్న, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన’ సుస్థిరమైన, అత్యంత నివాసయోగ్యమైన సమాజంగా మారడానికి.. రూ.58లక్షల తలసరి ఆదాయంతో రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి రాష్ట్రం ప్రత్యేకమైన అంతర్గత బలాలను సద్వినియోగం చేసుకుంటోంది.
నిరుపేదరహిత సమాజం
వ్యక్తులు, కుటుంబాలకు సాధికారత కల్పించడం ద్వారా రాబోయే కొన్నేళ్లలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం స్వర్ణాంధ్ర `2047 ప్రయాణంలో ఒక ఆవశ్యకత. ప్రతి నెలా 1నే ఇంటివద్దే పింఛన్లు అందించే దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భóరోసాకు శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా సుమారు 64 లక్షలమంది లబ్ధి పొందుతున్నారు. నిరుపేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థను (పిడిఎస్) బలోపేతం చేసి, రూ.5ల నామమాత్రపు ధరకే పౌష్టికాహారం అందించే 204 అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాం. బలహీన వర్గాల విద్య, సామాజిక భద్రత, ఆర్థిక సాధికారతపై దృష్టి సారించాం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అమలు చేస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఆదాయకల్పన కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారించి రూ.2000 కోట్లను కేటాయిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఆర్థిక మద్దతు పథకాలను పునరుద్ధరించాం. ముఖ్యంగా 4.93 లక్షల మంది బలహీన గిరిజన సమూహాలతో కలుపుకొని 27.39 లక్షల షెడ్యూల్డ్ తెగల సమగ్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వెనుకబడిన తరగతుల ఆర్ధిక, సామాజిక, రాజకీయ సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీసీ సామాజిక వర్గాల సంక్షేమం కోసం, స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు, ఆదాయం వచ్చే కార్యకలాపాల కోసం వివిధ కార్పొరేషన్లకు రూ.896 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడంతో సహా పలు కీలక కార్యక్రమాలను మేము అమలు చేయడం జరిగింది. రాష్ట్ర శాసనసభలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. స్థానిక సంస్థలు మరియు నామినేటెడ్ పోస్టులలో 34 శాతం రిజర్వేషన్లను కల్పించే దిశగా మేము పనిచేస్తున్నాం. ప్రత్యేక బీసీ పరిరక్షణ చట్టాన్ని తెచ్చేందుకు రోడ్‌మ్యాప్ రూపొందించాం. ఆలయ అర్చకుల గౌరవ వేతనాన్ని రూ.15,000లు, నాయీబ్రాహ్మణుల గౌరవ వేతనాన్ని రూ.25,000లకు పెంచాం. నిరుద్యోగ వేద విద్యార్థులకు రూ.3,000ల భత్యాన్ని ఇస్తున్నాం.
మహిళల సంక్షేమానికి దీపం-2 పథకాన్ని ప్రవేశపెట్టాం. ఇప్పటివరకు రూ.686 కోట్ల మొత్తం పంపిణీతో ఇప్పటికే 86.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ‘‘అందరికీ ఇల్లు’’ పేరిట అవసరమైనచోట ఇంటి స్థలాలను తగువిధంగా సమకూరుస్తూ సంతృప్త విధానంలో 2029 చివరినాటికి రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలన్నింటికీ శాశ్వత గృహాలను సమకూర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మొదటి ఏడాది పూర్తయ్యేనాటికి పట్టణ మరియు గ్రామీణ పేదల కోసం 4 నుండి 5 లక్షల ఇళ్ళను పూర్తి చేయనున్నాం. ఈ విధంగా సమష్టి దార్శనికత, ఆలోచనలు, అంకితభావంతో కూడిన కార్యక్రమాలకు స్థూలస్థాయిలో ప్రణాళికలు రచించి, సూక్ష్మస్థాయిలో అమలు చేయడం ద్వారా ప్రతి పౌరుడికి సుసంపన్నమైన, స్వావలంబన, గౌరవప్రదమైన భవిష్యత్తును నిర్ధారిస్తూ పేదరికంలేని సమాజం దిశగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రభుత్వం నడిపిస్తోంది.
మానవ వనరుల అభివృద్ధి మరియు జనాభా నిర్వహణ
సుస్థిర ఆర్థిక వృద్ధికి మరియు మానవ వనరుల అభివృద్ధికి నైపుణ్యం, ఆరోగ్యకరమైన శ్రామిక శక్తి మూలస్తంభమని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది. దార్శనికతకు అనుగుణంగా విద్య, ఆరోగ్య రంగాలపై వ్యూహాత్మక దృష్టి సారించడం ద్వారా మానవ వనరుల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తున్నాం. ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టితో డిజిటల్ పరిజ్ఞానం, సృజనాత్మకతను మేళవించి ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం. సుమారు రూ.1770 కోట్లమేర పెండిగ్ బకాయిలు తీర్చి.. ఎన్టీఆర్ వైద్యసేవ, ఉద్యోగుల ఆరోగ్య పథకంవంటి కీలక పథకాలను పునరుద్ధరించాం. ప్రతి శానససభ నియోజకవర్గంలోనూ 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం కోసం ఒక విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది.
వ్యవసాయం, ఆహారపు అలవాట్లు మరియు ఆరోగ్యం మధ్య అనుసంధానంపై దృష్టి పెట్టడం ద్వారా మన జనాభా యొక్క మారుతున్న ధోరణులను పరిష్కరిస్తున్నాం. ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు మరియు సేంద్రీయ ఉత్పత్తులు వంటి ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ప్రజలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ మార్పులో ఏపీ అగ్రగామిగా ఉంది.
మన సమాజ మూలాలను పటిష్టపరచడానికి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విద్యా సంస్కరణలను నా ప్రభుత్వం అమలు చేస్తున్నది. సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా మేము దేశంలోనే మొట్టమొదటి మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌హోను నిర్వహించాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ అనే మధ్యాహ్న భోజన కార్యక్రమానికి మేము తిరిగి రూపకల్పన చేశాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కార్యక్రమం ద్వారా 35.94 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించనున్నాం. ‘మనబడి `మన భవిష్యతు’ వంటి కార్యక్రమాల ద్వారా మేము మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తున్నాం. ఉన్నత విద్యను క్రమబద్ధీకరించడానికి, సుస్థిర కార్యవిధానాలను అనుసరించి, పూర్తిగా ప్రతిభ ఆధారంగా 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించాం. దూరదృష్టి, లక్ష్యసాధనతో, సుస్థిర ఆర్థికాభివృద్ధికి పునాది వేస్తూ ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, సమర్థవంతమైన జనాభా నిర్వహణను ప్రోత్సహిస్తున్నది.
ఉపాధి, నైపుణ్యం
విద్య, నైపుణ్యాల పెంపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహానికి కేంద్ర బిందువులు. నైపుణ్యాల ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ అప్‌గ్రేడేషన్‌పై దృష్టిసారిస్తూ స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రజల నైపుణ్యాలను గుర్తించడానికి రాష్ట్రం మొట్టమొదటిసారిగా నైపుణ్య గణనను నిర్వహిస్తోంది. అభివృద్ధికి ‘ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త’ అనే అంశంపై దృష్టిసారిస్తూ ఉపాధికల్పనకు బలమైన పునాది వేయడమే ప్రభుత్వ సమగ్ర విధానం. ఆత్మగౌరవం, ఆర్థిక స్థిరత్వం రెండిరటినీ తీసుకొచ్చే వృత్తులకు విలువనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ స్వీయ సంతృప్తికరమైన పనిని స్వీకరించడం జరిగింది. అవకాశాలను చురుకుగా ఉపయోగించుకోవడానికి ప్రేరేపిస్తుంది, నైపుణ్యాలను స్థిరమైన జీవనోపాధిగా మారుస్తుంది. స్థానిక పరిశ్రమ అవసరాలను తీర్చడానికి నిరుద్యోగ యువత, కళాశాల డ్రాపవుట్‌లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, డిగ్రీ కళాశాలల్లో 200 స్కిల్ హబ్‌లను ఏర్పాటు చేశాం. మనం ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి సారించారు. ఈ కార్యక్రమం క్రింద 4,700 ఎకరాల్లో 800పైగా భూకేటాయింపులను విజయవంతంగా నిర్వహించి, రూ.78,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు 48,789 ఉద్యోగాలను కల్పించడమయింది.
కీలక ఉపాధికల్పన రంగంగా ఉన్న పర్యాటకం సమాజాలలో సాధికారత తీసుకురావడంలో, సుస్థిరవృద్ధిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-29 రాష్ట్రం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం, సహజ సౌందర్యం, వైద్యం మరియు ఎకో టూరిజం సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచపర్యాటక కేంద్రంగా మార్చాలని భావిస్తున్నది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు పచ్చదనం కార్యకలాపాలను ఏకీకృతం చేస్తూ సుస్థిర పర్యాటకంపై రాష్ట్రం దృష్టిసారిస్తున్నది.
ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్స్, పర్యాటకం వంటి అధిక వృద్ధి రంగాలపై దృష్టిసారిస్తూ బ్లూ, వైట్ కాలర్ ఉద్యోగాలతో సహా అన్ని కేటగిరీల్లో ఉపాధిని కల్పించడం ఆంధ్రప్రదేశ్ సమగ్ర వ్యూహం. ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్స్, అపెరల్ అండ్ గార్మెంట్ పాలసీ 2024 ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో ఐదు టెక్స్‌టైల్ పార్కుల ద్వారా ఐదేళ్లలో రూ.10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం మరియు 2 లక్షల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి వ్యూహాత్మక చొరవలు, అచంచలమైన నిబద్ధత ద్వారా, ఆంధ్రప్రదేశ్ ఉపాధి, అధునాతన నైపుణ్యానికి కేంద్రంగా రూపాంతరం చెందుతున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి కల్పించడానికి లేదా ఉపాధి భత్యం ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం.
నీటి భద్రత
ప్రతి ఇంటికి తాగునీరు అందించడం, సమాన పంపిణీ, వ్యవసాయ స్థితిస్థాపకత కోసం నదుల అనుసంధానం, సంరక్షణ చర్యల ద్వారా అన్ని రంగాల్లో నీటి వినియోగాన్ని గరిష్టతరం చేయడాన్ని కట్టుదిట్టం చేస్తూ నీటి సురక్షిత భవిష్యత్తుకు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంది. నీటికి సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి మరియు కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రాధాన్యతా ప్రాతిపదికన వినియోగదారులందరికీ నీటి లభ్యతను సులభతరం చేయడానికి, గృహ అవసరాలు, పారిశ్రామిక, వ్యవసాయ మరియు ఇతర వినియోగదారులకు నీటిని అందించేందుకు ఒక కొత్త రాష్ట్ర జల విధానాన్ని రూపొందించడమవుతున్నది.
గత ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు మరియు మౌలిక సదుపాయాలను పూర్తిగా ఉపేక్షించడంతో రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలలోని ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం తిరిగి దృష్టిసారించి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పోలవరానికి అనుసంధానం చేస్తుంది. మన జీవనాడి అయిన పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు 73శాతం పురోగతి సాధించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే కాకుండా 28.5 లక్షల మందికి లబ్ధిని చేకూరుస్తూ, 540 గ్రామాలకు తాగునీటిని కూడా అందిస్తుంది. పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి 960 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. గత ప్రభుత్వ అనైతికత వల్ల డయాఫ్రమ్ వాల్ కూలి, ప్రాజెక్టు జాప్యానికి కారణమయింది. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కి 2027నాటికి దాని వాస్తవ స్థాయికి పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. కరవు రహిత రాష్ట్ర లక్ష్యాన్ని సాధించే దిశగా, మా ప్రభుత్వం పోలవరం నుండి బనకచెర్ల నదీ అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇది లింక్ కాలువ ద్వారా గోదావరి నది నుండి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్‌కు నీటిని బదిలీ చేస్తుంది. ఇది జీవితాలను మార్చడమే కాదు, కరువును అభివృద్ధిగా, కొరతను సమృద్ధిగా మరియు నిరాశను నమ్మకంగా మారుస్తున్నది. ఒకప్పుడు సుదూర స్వప్నంగా ఉన్న నీరు ఇప్పుడు సాకారమై, రాయలసీమను నీటి సురక్షిత ప్రాంతంగా మార్చనుంది.
అమృత్ `జల్ జీవన్ మిషన్ (జెజెఎం) అమలు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయింది. మనం ఈ అవకాశాన్ని కోల్పోయినపుడు, ఇతర రాష్ట్రాలు వాటిని పెద్దఎత్తున అమలు చేశాయి. జెజెఎం విషయంలో ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడం వల్ల కేవలం రూ.2,255 కోట్లు మాత్రమే వినియోగించుకుంటూ, ఏపీ అట్టడుగున నిలిచింది. దీనిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో, ప్రతీ కుటుంబానికి కుళాయి నీరు అందేటట్లు చేయడానికి, నిధులను వినియోగించుకోవాలనీ మరియు 95.44 లక్షల గ్రామీణ కుటుంబాలన్నింటికీ వర్తింప చేయాలన్న నిశ్చయంతో ఉంది. ఈ చొరవల ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటి భద్రత, వ్యవసాయపరంగా సుసంపన్నమైన, పర్యావరణపరంగా సుస్థిర భవిష్యత్తుకు పునాది వేస్తోంది.
రైతు -వ్యవసాయ సాంకేతికత
వ్యవసాయం ఎల్లప్పుడూ ఏపీకి వెన్నెముకగా ఉంది. ఇప్పుడు రైతు `వ్యవసాయ సాంకేతిక జోక్యాల ద్వారా ఈ రంగాన్ని మరింత లాభదాయకంగా మరియు సుస్థిరంగా మారుతోంది. ఆహార ఉత్పత్తి నుంచి ఆహార ప్రాసెసింగ్ వైపుకు మళ్లించడం, వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడిరచడం మరియు రైతులకు కొత్త అవకాశాలను సృష్టించడంపై దృష్టి సారించింది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పద్ధతులను అవలంభించాలనే తపనతో ఉన్న వినూత్న మరియు అభ్యుదయ రైతులకు ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ నిలయంగా ఉంది. రాబోయే ఐదేళ్లలో ప్రకృతి సేద్య అనుసరణను 10.68 లక్షల మంది రైతుల నుంచి 50 లక్షల మంది రైతులకు పెంచడానికి, విస్తీర్ణాన్ని 4.95 లక్షల హెక్టార్ల నుంచి 20 లక్షల హెక్టార్లకు పెంచి, ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్-ను అగ్రగామిగా చేయాలనే లక్ష్యంతో ప్రకృతి సేద్య పద్ధతులను అవలంభించేలా మేము రైతులను ప్రోత్సహిస్తున్నాం. సమీకృత, సాంకేతిక ఆధారిత చొరవలపై దృష్టిసారించడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా లాభదాయకంగా మరియు సుస్థిరంగా ఉండే స్థితిస్థాపక వ్యవసాయ రంగాన్ని నిర్మిస్తోంది.
ప్రపంచ ఉత్తమ వ్యూహరచనలు
మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు మరియు మల్టీ మోడల్ రవాణా కేంద్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అవి మన రాష్ట్రాన్ని ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించే కొత్త వాణిజ్య కారిడార్లను ఏర్పాటు చేస్తాయి. బహిరంగ వర్తక విధానాన్ని అమలు చేయడం, తదుపరి తరం కమ్యూనికేషన్ కోసం టెలికం స్పెక్ట్రమ్ సామర్ధ్యాన్ని మెరుగుపరచడం మరియు విస్తృత డిజిటల్ కనెక్టివిటీని నిర్ధారించడం ద్వారా రాష్ట్రం ప్రపంచ స్థాయి డిజిటల్ మరియు భౌతిక మౌలిక సదుపాయాలను కలిగివుండాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1,053 కిలోమీటర్ల తీరప్రాంతం, వ్యూహాత్మక కనెక్టివిటీ మరియు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఏపీని ప్రపంచ అత్యుత్తమ లాజిస్టిక్స్ రాష్ట్రంగా రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖపట్నం, కృష్ణపట్నం, రామాయపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం మరియు మూలపేట ఓడరేవులతోపాటు ప్రస్తుతమున్న 10 పోర్టులన్నింటినీ ప్రపంచస్థాయి ఓడరేవులుగా తీర్చిదిద్దుతున్నాము. 2029నాటికి, వైజాగ్ 46.23 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్‌హోవర్క్‌హోను కలిగి ఉండగా, విజయవాడలో 38.40 కిలోమీటర్ల నెట్‌హోవర్క్ కలిగి ఉంటుంది. రూ.22,507 కోట్ల ఉమ్మడి పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు రవాణా మౌలిక సదుపాయాలను ఆధునీకరించి, ప్రయాణ సమయాన్ని తగ్గించడంతోపాటు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి.
వాటర్ షెడ్లు, వీధిదీపాలు మరియు పారిశుద్ధ్య సదుపాయాలు వంటి గ్రామీణ మౌలిక సదుపాయాలను ప్రభుత్వం బలోపేతం చేస్తుంది. ప్రజల చురుకైన భాగస్వామ్యంతో, సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించింది. సిసి రోడ్లు, బిటి రోడ్లు, పశువుల షెడ్లు.. ఇలా 30,000 పనులను మంజూరు చేసింది. 4,300 కి.మీ.ల సిసి రోడ్లను మంజూరు చేసింది. వాటిలో 3,000 కి.మీ.లు పూర్తయ్యాయి. 1300 కి.మీ.లు తుది దశలో ఉంది.
వ్యయ నియంత్రణ, విద్యుత్ `ఇంధనం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహానికి ఇంధనం ఒక కీలక అంశం. ప్రపంచస్థాయి క్లీన్ ఎనర్జీ చొరవలతో రాష్ట్రం ముందంజలో ఉంది. ఇంధన రంగంలో వ్యయ నియంత్రణలో విద్యుత్ `ఇంధన శాఖ యొక్క అచంచలమైన నిబద్ధత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుస్థిరతను పునర్నిర్మిస్తోంది.
2024, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఇంధన ఉత్పత్తి మరియు వినియోగంలో స్వయం స్వావలంబన సాధించాలన్న రాష్ట్ర లక్ష్యంతో కలుపుకొని 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడిరచడం, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం మరియు 7.5 లక్షల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను సృష్టించడాన్ని లక్ష్యంగా నిర్ధేశించుకోవడమయింది. వాహనాలన్నింటినీ 100శాతం విద్యుదీకరణ చేయడానికి సంబంధించిన ప్రణాళికలతో ఎలక్ట్రిక్ వాహనాలకు మారడంలో కీలక పాత్ర పోషించనుంది. మొత్తం విద్యుత్ రంగాన్ని పునర్ నిర్మించడం ద్వారా ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. కుప్పం నియోజకవర్గంలో గృహ, వ్యవసాయ వినియోగదారులు, ప్రభుత్వ భవనాలను 100 శాతం సోలరైజేషన్ సాధించి సుస్థిరాభివృద్ధికి కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఉత్పత్తి పరిపూర్ణత
ఆవిష్కరణ, నాణ్యత మరియు ప్రపంచ పోటీతత్వాన్ని నడిపించే ఉత్పత్తి పరిపూర్ణ పర్యావరణ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోంది. సంపద సృష్టిని వేగవంతం చేస్తూ, ఈ పర్యావరణ వ్యవస్థ పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుంది. ఉత్పత్తి పరిపూర్ణత అనేది ‘‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’’ను ప్రపంచ విశిష్టతకు చిహ్నంగా మార్చేటట్లు చేయడం కోసం పన్డీయే ప్రభుత్వం యొక్క అచంచలమైన నిబద్ధత. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకీకృతం చేయడం, ఉత్తమ పద్ధతులను అవలంబించడం మరియు బలమైన నాణ్యతా నియంత్రణ వ్యవస్థలను అమలు చేయడం ద్వారా, మేము మా ఉత్పత్తులను అత్యంత కఠినమైన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరుస్తున్నాం. నాణ్యత, విశిష్ఠతకు ప్రమాణాలను నిర్దేశిస్తూ, ఉద్యానవన రంగం, ఆక్వాకల్చర్‌హోలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో అగ్రగామిగా అవతరించింది. భారతదేశపు అతిపెద్ద పండ్ల ఉత్పత్తిదారుగా, దేశం మొత్తం ఉత్పత్తిలో 15.6 శాతం వాటాను అందిస్తూ ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమోటా మరియు కొబ్బరి వంటి కీలక పంటల ఉత్పాదకతలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో 11 కీలక పంటలకు క్లస్టర్ ఆధారిత విలువ చైనులను సుస్థిర అభివృద్ధి, మార్కెట్ పోటీతత్వానికి తగ్గట్టుగా ప్రోత్సహిస్తుంది. ఈ-మిర్చా కార్యక్రమం మిరప ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డిజిటల్ ఆవిష్కరణలను ఉపయోగిస్తోంది.
స్వచ్ఛాంధ్ర:
పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుస్థిర ఆంధ్రప్రదేశ్ కోసం సమగ్ర దార్శనికతను ప్రతిబింబిస్తుంది స్వచ్ఛాంధ్ర. ఈ చొరవ భౌతిక పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, కుటుంబ పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ మరియు పనిప్రాంత పరిశుభ్రతకు మించి ఉంటుంది. ఇది ఆలోచనల స్వచ్ఛత, ఆరోగ్యకరమైన జీవనం మరియు మన పరిసరాల పట్ల సమిష్టి బాధ్యతను పెంపొందిస్తుంది. నా ప్రభుత్వం వ్యర్థాలను వేరుచేయడం, చెత్తను తగ్గించడం మరియు బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ స్పృహ కలిగిన పద్ధతులను అవలంభించడానికి పౌరులను ప్రోత్సహిస్తోంది. ప్రతినెలా 3వ శనివారం ‘‘స్వచ్ఛాంధ్ర దినోత్సవం’’గా పాటిస్తూ పరిశుభ్రత కార్యక్రమాలు మరియు అవగాహన కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తున్నాం.
విస్తృత సాంకేతికత ఏకీకరణ
పరిపాలన, సర్వీస్ డెలివరీ, రిసోర్స్ మేనేజ్‌హోమెంట్‌ను పెంచడం ద్వారా అన్ని రంగాల్లో విస్తృత సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ పరివర్తనకు ప్రభుత్వం నాయకత్వం వహిస్తోంది. ఏఐ, బ్లాక్ చెయిన్, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) పరిపాలనా ప్రతిస్పందనలో సమర్థత, పారదర్శకతను పెంచుతున్నాయి. సర్వీస్ డెలివరీ మరియు నిర్వహణ సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి విస్తృత సాంకేతికత ప్రభుత్వం యొక్క భౌతిక మౌలిక సదుపాయాలను భర్తీ చేస్తోంది. పరిపాలనా ప్రతిస్పందనను పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, కంప్యూటర్ విజన్ మరియు డ్రోన్లను ఉపయోగిస్తూ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్-టిజిఎస్) 4.0 ఈ డిజిటల్ పరివర్తనలో ముందంజలో ఉంది. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ అందుబాటులోకి వచ్చింది. 161 పౌరసేవలు అందిస్తూ ‘మన మిత్ర’ అనే వాట్సప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. ఇది డిజిటల్ గవర్నెన్స్‌హోకు జాతీయ ప్రమాణాలను నిర్దేశించింది.
సుపరిపాలన – పౌరుల రక్షణ
నేరాలపట్ల ఏమాత్రం ఉపేక్షలేని ధృడమైన నిబద్ధతతో మంచిపాలనకు కట్టుబడి ఉంది. మానవ సంక్షేమం, సామాన్యుల భద్రత మా ముఖ్య ప్రాధాన్యత. నా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు ప్రజా భద్రతా చర్యలను బలోపేతం చేస్తోంది. ప్రజా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ మరియు రియల్ టైం గవర్నెన్స్‌హోను మెరుగుపరచడానికి, లక్షలాది ప్రైవేట్ సిసిటివి కెమెరాలను అనుసంధానించడంతో పాటు సుమారుగా 20,000 సిసిటివి కెమెరాలతో ఒక రాష్ట్ర వ్యాప్త క్లౌడ్ ఆధారిత ఐపి సిసిటివి నిఘా వ్యవస్థను మోహరించడమైనది. సైబర్ నేరాలను నేర్పుగా ఎదుర్కోవడానికి, ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్‌హోను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించడమవుతున్నది. ఏపీలో గంజాయి మరియు మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌హోఫోర్స్‌హోమెంట్ (ఈఎజిఎల్‌ఇ), విద్యాసంస్థలు మరియు యువతపై దృష్టిని సారిస్తోంది. మా ప్రభుత్వం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, గంజాయి అక్రమ రవాణా మరియు మహిళలపై నేరాలు వంటి సంఘ విద్రోహ శక్తులను ముందస్తుగా నియంత్రించడం మరియు అటువంటి దుర్మార్గపు చర్యలను నిర్మూలించడానికి తగిన పద్ధతులను తీసుకురావడం ద్వారా వాటిని పరిష్కరిస్తోంది. నేరాలను ఏమాత్రం సహించకుండా, సురక్షితమైను సమాజాన్ని నిర్వహించడానికి, ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, శాంతి భద్రతలను కఠినంగా అమలు చేయడమవుతుంది. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత మరియు అందరికీ న్యాయం మరియు భద్రతనిస్తూ, మహిళలపై జరిగే ఏ నేరాన్నైనా కఠినంగా అణచివేయడం జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిరంతర అనుసంధానంతో, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసు ద్వారా సమర్థవంతంగా శాంతిభద్రతలను కట్టుదిట్టం చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం.
ముగింపు
స్వర్ణాంధ్ర దిశగా ఏపీ పయనం సమృద్ధి, సమ్మిళితత్వం, సుస్థిరతపట్ల అచంచలమైన నిబద్ధతకు ఒక స్పష్టమైన ఉదాహరణ. ఈ దార్శనికత అంకెలు, ఆర్థిక సూచికలకు అతీతంగా ఉంటుంది. ఇది ప్రజలను శక్తివంతం చేయడం, వర్గాలను బలోపేతం చేయడం మరియు రాష్ట్రం యొక్క ప్రతి మూలకు పురోగతి చేరేలా చూస్తుంది. ఇది కేవలం ప్రభుత్వ చొరవ మాత్రమే కాదు, ఆధునిక, స్వావలంబన, అంతర్జాతీయంగా పోటీతత్వం కలిగిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి భాగస్వామి సహకరించాలని పిలుపునిచ్చే ఉద్యమం. పొలాల్లో సమృద్ధిని పెంపొందించే రైతులు, ఆవిష్కరణలను ప్రోత్సహించే పారిశ్రామికవేత్తలు, కొత్త శక్తిని తీసుకువచ్చే యువత మరియు సమ్మిళితత్వాన్ని నిర్ధారించే సామాజిక నాయకులు ఇందులో ఉన్నారు.
వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పాల్గొనడానికి అవసరమైన సాధనాలతో యువతను సన్నద్ధం చేస్తూ విద్య, నైపుణ్యం మరియు డిజిటల్ ప్రాప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి వ్యక్తి సాధికారతను పొంది మరియు అందరినీ కలుపుకున్నట్లు భావించినప్పుడు మాత్రమే పురోగతి సాధించామని నిజంగా చెప్పగలం.
‘‘లేవండి, మేల్కొనండి మరియు లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించవద్దు’’ అని స్వామి వివేకానంద చెప్పిన మాటలను నేను ఇప్పుడు ఉదహరిస్తున్నాను. చివరగా, ఆంధ్రప్రదేశ్ యొక్క బలం దాని విధానాలు మరియు ప్రాజెక్టులలో మాత్రమే కాదు, దాని ప్రజల మమైకత, దృఢసంకల్పం మరియు ఆవిష్కరణ స్ఫూర్తిలో ఉందని గుర్తుంచుకుందాం. ముందున్న మార్గం అవకాశాలతో నిండి ఉంది. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపై ఉంది. ఇది మనదైన తరుణం. వ్యవహరించాల్సిన సమయమూ ఇప్పుడే. కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసి నిర్మించుకుందాం, కలిసి ఎదుగుదాం, ఆంధ్రప్రదేశ్‌హోను భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఒక అభివృద్ధి మార్గదర్శిగా నిలిచేలా చేద్దాం’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రభుత్వం తరఫున పిలుపునిచ్చారు.
11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్!
అనర్హత వేటు తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చారనే విమర్శల మధ్య.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాలకే ఇక చాల్లే పోదం పదండి అన్నట్టు వైకాపా సభ్యులతో కలిసి జగన్ బయటకు వచ్చేశారు. గవర్నర్ ప్రసంగం సాగుతుండగా సభలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ సభ్యులు తీవ్రంగా యత్నించారు. ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. అయినా వైసీపీ దుష్ట ప్రయత్నం ముందుకు సాగకపోవడంతో.. తోకముడిచి బయటకు వెళ్లిపోయారు.