- ఆధునిక టెక్నాలజీతో క్యూ ఆర్ కోడ్ కార్డులు అందిస్తాం
- మహిళలందరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
- మే నెల నుంచి మధ్యాహ్న భోజనానికి, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం
- రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
నెల్లూరు (చైతన్యరథం) : రాష్ట్రవ్యాప్తంగా వచ్చేనెల నుంచి కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి నాదెండ్ల పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగం సమీపంలోని రైసుమిల్లును, బహుళ ప్రయోజన సౌకర్య గోదాము (స్టాక్ పాయింట్)ను మంత్రి తనిఖీ చేశారు. రైసుమిల్లును తనిఖీ చేసి ధాన్యం సేకరణకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టాయిపాయింట్‌ను తనిఖీ చేసి స్టాకు వివరాలు, సరఫరా మొదలైన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళలనుద్దేశించి మాట్లాడారు. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమన్నారు. మహిళలందరూ కూడా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వచ్చేనెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రేషన్‌కార్డులను అందిస్తామని చెప్పారు. రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దీపం`2 పథకం హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారని, ఇందులో భాగంగా ఈ జిల్లాలో 4లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 93.42లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఈ ఏడాది 1.50 కోట్లు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా వున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారం మహిళలందరూ తెలుసుకోవాలని, భాగస్వామ్యం కావాలని సూచించారు. మే నెల నుంచి అన్ని సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు. కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అహర్నిశలు శ్రమిస్తూ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ప్రజలందరూ కూడా మంచి పరిపాలన అందిస్తున్న ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వానికి ఆశీస్సులు అందించాలని కోరారు.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ స్టాక్ పాయింట్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారని, ఇలాంటి చిత్తశుద్ధి గల నాయకుడు సివిల్ సప్లయిస్ మంత్రిగా వుండడం మనందరి అదృష్టంగా ఎంపీ చెప్పారు. జిల్లాలోని స్టాక్ పాయింట్ల అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తమై ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రజలకు తుకాల్లో తేడాలు లేకుండా నాణ్యమైన వస్తువులను అందించాలని సూచించారు. అన్ని వస్తువులు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండేలా చూసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిడ్కో చ్కెర్మన్ వేములపాటి అజయ్‌కుమార్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చ్కెర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో పావని, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డీసీవో గుర్రప్ప, తదితరులు పాల్గొన్నారు.