- అనవసర విషయాలపై రాద్ధాంతం
- రాష్ట్రంలో శాంతి,భద్రతల సమస్యకు కుట్ర
- ఆ పార్టీ కుయుక్తులు సాగనివ్వం
- కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
శ్రీకాకుళం (చైతన్యరథం): ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కు వెళ్లిపోయిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. జగన్ అహంకారం, లెక్కలేనితనం కారణంగానే ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని.. అయినా ఆ పార్టీ ధోరణిలో ఇంకా మార్పు రావటం లేదన్నారు. ప్రజలు ఛీకొట్టినా వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. ఆదివారం స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 68వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎర్రన్న ఆశయాలు కొనసాగిస్తామని అన్నారు. ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడని కొనియాడారు. దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధనకు ఎర్రన్న ఎంతగానో కృషి చేశారని తెలిపారు. నిరంతరం పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారని గుర్తుచేశారు.
వైసీపీని ప్రజలు మర్చిపోయారు…కాబట్టే ఏదో ఒక విషయంపై హంగామా చేస్తున్నారని రామ్మోహన్‌నాయుడు విమర్శించారు.
జగన్‌కు ప్రతిపక్ష హోదా రాలేదని, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వలేదని అనవసర అంశాలపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి ఎన్నికల కోడ్ గురించి తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా గుంటూరు మిర్చియార్డు వద్ద హడావుడి చేసి, భద్రత కల్పించలేదంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ కుట్ర పన్నిందని.. ఆ పార్టీ కుట్రలను సాగనివ్వమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ కార్యక్రమాలను స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఉపాధ్యాయులు, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేశారని ధ్వజమెత్తారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మను గెలిపించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు.