- ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆయన సేవలు చిరస్మరణీయం
- నిబద్ధత, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన నేత
- ఎర్రన్నాయుడి ఆశయసాధనకు కృషి చేస్తాం
- జయంతి సందర్భంగా నేతలు, కుటుంబసభ్యుల నివాళి
నిమ్మాడ (చైతన్యరథం): దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడి ప్రస్థానం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని నేతలు కొనియాడారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఎర్రన్నాయుడు 68వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు ఘాట్ దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సతీమణి విజయమ్మ, కుమారుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సోదరుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కోటబొమ్మాళి పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓఎస్డీ కింజరాపు ప్రభాకర్ రావు, దివంగత నేత ఎర్రన్నాయుడుకి నివాళులు అర్పించారు. ఆయనకు పుష్పాంజలి ఘటించాక కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. దేశం గర్వించదగ్గ నేతల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి రాణించిన నేతల్లో అగ్రగణ్యుడు అంటూ ఎర్రన్నాయుడి సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజా ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన తమ మధ్య లేకపోయినా ప్రజలు తమనూ, తమ కుటుంబాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. ఏమిచ్చినా ఎప్పటికీ ప్రజల రుణం తీర్చుకోలేమని భావోద్వేగ భరితం అయ్యారు. ఎర్రన్న ఆశయ స్ఫూర్తిని అందుకుని పనిచేయడంలోనే నిజమైన ఆనందం ఉందన్నారు.
తొలుత ఎర్రన్నాయుడి ఘాట్‌కు చేరుకున్న అభిమానులను రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, కుటుంబ సభ్యులందరూ.. పేరు పేరునా పలకరించారు. వారంతా ఎర్రన్నాయుడుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా గల్లీ నుంచి ఢల్లీి వరకూ నాయకుడిగా ఎర్రన్న ఎదిగిన వైనం, క్రమశిక్షణాయుత టీడీపీ కార్యకర్తగా తొలినాళ్లలోనే గుర్తింపు పొందిన వైనం ఎన్నటికీ, ఎప్పటికీ చెరగని స్ఫూర్తికి నిదర్శనం అని కొనియాడారు.
అన్నయ్య ఆశయంలో భాగంగానే తామంతా పనిచేస్తామని ఎర్రన్న సోదరులు పునరుద్ఘాటించారు. ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా ఉద్దానంకు తాగునీటి అందించే ప్రాజెక్టుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు. అన్నయ్య స్నేహానికి విలువ ఇచ్చే గొప్ప వ్యక్తి అని అన్నారు. కోటబొమ్మాళి పరిసర ప్రాంతాలలో స్థానిక సమస్యల పరిష్కారానికి ఎంతో చొరవ చూపేవారన్నారు. విలువలు, విశ్వసనీయతకు చిరునామా..ప్రజాసేవలో ఎందరికో ఆదర్శనీయులు..ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉండే నాయకుడని కొనియాడారు.
తరలివచ్చిన అభిమాన గణం
దివంగత నేత కింజరాపు యర్రన్నాయుడు జయంతిని పురస్కరించుకుని అభిమానులు పెద్గసంఖ్యలో తరలి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన ఆశయ సాధనకు అంతా కృషి చేయడమే నిజమైన నివాళి అని పలువురు పేర్కొన్నారు. దేశ రాజకీయాలలో రాణించిన మహోన్నత శిఖరం ఆయన అని కొనియాడుతూ.. వివిధ సందర్భాలలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించారు. అనంతరం పలు చోట్ల పలు సేవా కార్యక్రమాలు జరిగాయి.
జోహార్ ఎర్రన్న అంటూ నినాదాలు చేసిన కార్యకర్తలు అభిమానులు
ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం, పాతపట్నం ఎమ్మెల్యేలు గొండు శంకర్, మామిడి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ, మాజీ ఎమ్మెల్సీ విశ్వ ప్రసాద్, టెక్కలి నియోజకవర్గ ముఖ్య నాయకులు బోయన గోవింద రాజులు, వెలమల కామేశ్వరరావు, విజయలక్ష్మి, బగాది శేషగిరి రావు, పినకాన అజయ్ కుమార్, మల్ల బాలకృష్ణ, పోలాకి చంద్రశేఖర్, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు, పాల్గొన్నారు.