- గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- ఏర్పాట్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమీక్ష
- భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశం
- తొలిరోజు ఉదయం 9.30కే సభ్యులందరూ హాజరుకావాలి
- ఎమ్మెల్యేల పీఏలకు పాస్‌లు లేవు
- 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి పయ్యావుల
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశ ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుందని, సభ్యులందరూ ఉదయం 9.30 గంటలకు సభకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, అధికారుల వ్యక్తిగత సహాయకులకు (పీఏ) పాసులు జారీ చేయబోవటం లేదు.
అందువల్ల వారికి ప్రవేశం ఉండదు. సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రిని కలిసే సందర్శకులు, ప్రతినిధులను శాసనసభ ప్రాంగణంలో అనుమతించరు. వారు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే భేటీ కావాలని స్పీకర్ సూచించారు. శాసనసభ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. సమావేశాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియా పాయింట్, కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ కార్యదర్శి జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌కు గార్డ్ ఆఫ్ ఆనర్ అనంతరం సీఎం చంద్రబాబు ఆయనకు స్వయంగా స్వాగతం పలకనున్నారు. సీఎంతో పాటు శాసన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సైతం గవర్నర్‌కు అసెంబ్లీ వద్ద స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సందేశం చదివి వినిపించనున్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీ వాయిదా పడనుంది. తరువాత జరిగే బీఏసీ సమావేశంలో శాసనసభ షెడ్యూల్, అజెండా ఖరారు చేస్తారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మార్చి 28వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు.. వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.