- రాజమండ్రి ఈఎస్‌ఐ డాక్టర్లు, సిబ్బంది సస్పెన్షన్ సబబే
- ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈఎస్‌ఐ డిస్పెన్సరీ పెట్టే యోచన
- ఏడాది కాలంలో ఐపీ హోల్డర్లను 30 లక్షలకు పెంచాలనేది లక్ష్యం
- మీడియాతో మంత్రి వాసంశెట్టి సుభాష్
అమరావతి (చైతన్యరథం): కార్మికులకు ఉచితంగా ఉత్తమ వైద్య సేవలు అందజేయాలనే లక్ష్యంతోనే ఇ.ఎస్.ఐ. ఆసుపత్రులను ఏర్పాటు చేశారని, ఆ లక్ష్యానికి విఘాతం కల్పించే విధంగా ప్రవర్తించే వైద్యులు, సిబ్బందిని ఏమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖల మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. రాజమండ్రి ఇ.ఎస్.ఐ. వైద్యులు, సిబ్బంది.. విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని స్వయంగా గమనించిన తరువాతే ఐదుగురు వైద్యులను, నలుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేశామని ఆయన తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ రాజమండ్రి ఇ.ఎస్.ఐ. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణి వల్ల ఆ ఆసుపత్రిలో ఓ.పి. గరిష్ఠంగా 50 కూడా లేదని, అయితే వీరిని సస్పెండ్ చేసిన తదుపరి ఓ.పి. 170 కి పెరిగిందని ఆయన తెలిపారు. తిరుపతి ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి వైద్యులు విధుల ప్లట ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల ఆ ఆసుపత్రిలో చాలా మంచి వైద్య సేవలు అందుతున్నాయని, అక్కడ ఓ.పి. దాదాపు 350 దాకా ఉందన్నారు.
గత ప్రభుత్వం ఇ.ఎస్.ఐ. ఆసుపత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కాకినాడ ఇ.ఎస్.ఇ. ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. రాష్ట్రంలోని కార్మికుల భద్రతకు, సంక్షేమానికి, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని, ప్రస్తుతం ఉన్న 78 డిస్పెన్సరీలకు అదనంగా మరో 18 డిస్పెన్సరీలను తమ ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. అదే విధంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఇ.ఎస్.ఐ. డిస్పెన్సరీ పెట్టే యోచనలో తమ ప్రభుత్వం ఉందన్నారు. ఏడాది కాలంలో ఐ.పి. (Iఅంబతీవస ూవతీంశీఅం) హోల్డర్లను 30 లక్షలకు పెంచాలనేది తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన కేవలం తొమ్మిది మాసాల కాలవ్యవధిలోనే అమరావతిలో 500 పడకల ఇ.ఎస్.ఐ. సెకండరీ కేర్ ఆసుపత్రితో పాటు ఇ.ఎస్.ఐ. మెడికల్ కళాశాలను, 150 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసే ప్రతిపాదనలను ఇ.ఎస్.ఐ.సి. డైరెక్టర్ జనరల్‌కు పంపించిందన్నారు. తిరుపతి ఇ.ఎస్.ఐ. ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకల సామర్థ్యానికి పెంచే చర్యలు చేపట్టామన్నారు. తద్వారా 97 రెగ్యులర్ పోస్టులు, 94 అవుట్సోర్సింగ్ పోస్టులు మంజూరు చేశామన్నారు. కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విశాఖ ఫార్మాసిటీలో సి.ఎస్.ఆర్. నిధులతో మొబైల్ ఐ.సి. యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వాసంశెట్టి తెలిపారు. ఇ.ఎస్.ఐ. సంచాలకులు ఆంజనేయులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.