- ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు
అమరావతి (చైతన్యరథం): హైకోర్టులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఇటీవల తీర్పు రిజర్వు చేసింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం తీర్పునిచ్చింది. వల్లభనేని వంశీ ఆదేశాల మేరకే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాహనాలు దగ్ధం చేసి భయబ్రాంతులకు గురిచేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. బాధితులు ఫిర్యాదుచేస్తే కేసు నమోదుచేసిన పోలీసులు.. అప్పట్లో నిందితులను అరెస్టు చేయలేదని తెలిపారు. వైసీపీ అధికారంలో ఉండగా.. ఈ కేసు దర్యాప్తును నీరుగార్చారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ముందస్తు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపారు. పిటిషనర్‌పై రాజకీయకక్షతోనే కేసు నమోదుచేశారని పిటిషనర్‌కు, దాడికి ఎటువంటి సంబంధం లేదని వంశీ తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో ఇటీవల వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.