- మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోళ్లు
- రైతు బజార్లలో విక్రయం
- అవసరం మేరకు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి
- అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో టమాటా ధరల పతనం దృష్ట్యా రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. టమాటాను రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు గురువారం సాయంత్రం మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత, సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మార్కెటింగ్ శాఖ శుక్రవారం నుంచి రైతుల దగ్గర టమాటా కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లులో నేరుగా విక్రయించాలని, పొరుగు రాష్ట్రాలకు అవసరం మేరకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే రవాణా సబ్సిడీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల మార్కెటింగ్ అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్లు, రైతు బజార్ల అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో ప్రత్యేకంగా కృషి చేయాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగు దశ నుంచి మార్కెటింగ్ దశ వరకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడిరచారు. టమాటా కొనుగోళ్లకు అధికారులు తక్షణమే చర్యలు ప్రారంభించాలని, పరిస్థితి తనకు నేరుగా ఎప్పటికప్పుడు తెలియచేయాలని ఆదేశించారు.