తిరుపతి (చైతన్య రథం): తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఐటి, లైఫ్ సైన్సెస్ ల్యాబ్‌లను రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధ్యాపకులు మంత్రి లోకేష్‌కు వివరాలు తెలియజేస్తూ… తాము అతితక్కువ ఖర్చుతో డ్రోన్ పీసీబీలు తయారు చేస్తున్నామని చెప్పారు. 2.5 కి.మీ.ల రేంజిలో పనిచేసే అధునాతన డ్రోన్‌ను తాము కేవలం రూ.5 లక్షలతో తయారు చేశామన్నారు. మునుపటి తెదేపా ప్రభుత్వంలో జ్ఞానభేరి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. డ్రోన్ సాఫ్ట్‌వేర్‌పై దృష్టి సారించాల్సిందిగా మంత్రి లోకేష్ సూచించారు. సోలార్ ఫోన్‌ఛార్జర్, వాటర్ బాటిల్స్ వ్యర్థాలతో బ్యాగుల తయారీ, బనానా వేస్ట్‌తో తయారు చేసిన శాలువా, హెర్బల్ శానిటరీ న్యాప్కిన్స్ తదితర ఆవిష్కరణలను మంత్రి లోకేష్ పరిశీలించారు. అనంతరం లైఫ్ సైన్సెస్ ల్యాబ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌ను మంత్రి లోకేష్ పరిశీలించారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యాన టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌వేర్ విభాగం, జునెసిస్, పద్మావతి వర్సిటీ సంయుక్తంగా ఈ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐఐటి, ఐషర్‌వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థుల నవీన ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు తాము సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నామని, 40లక్షల వరకు ఈక్విటీ సాయం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 26 మందికి రూ.3 కోట్లు అందించామని, మరో 14మందికి త్వరలో ఆర్థిక సాయం చేయన్నుట్టు తెలిపారు. ఇన్నోవేషన్స్, స్టార్టప్స్‌ను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని వారు వివరించారు.