- దళితులపై దాడులు చేసిన వారికి వైసీపీ అధినేత అండ
- బాధిత దళిత కుటుంబాలను ఏనాడూ పరామర్శించని జగన్
- రౌడీలు, దొంగల కోసం మాత్రం జైలుయాత్రలు
- కొత్త జైలుపక్షికి పాత జైలుపక్షి ఓదార్పు
- జైల్లో వంశీతో జగన్ ములాఖత్‌పై మంత్రి అనగాని ఎద్దేవా
అమరావతి (చైతన్యరథం): గతంలో అధికారం కోసం బూటకపు ఓదార్పు యాత్ర చేసిన జగన్ రెడ్డి … మరో బూటకపు జైలు యాత్ర నిర్వహించాడని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో అనగాని మాట్లాడుతూ గతంలో జైలుకు వెళ్లి వచ్చి మళ్లీ ఎప్పుడు జైలుకు వెళతాడో తెలియని పాత జైలు పక్షి.. కొత్తగా జైల్లో చేరిన మరో పక్షిని పలకరించడానికి వెళ్లిందని ఎద్దేవా చేశారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత జగన్ మాట్లాడిన తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. రౌడీజయిం, దౌర్జన్యం చేసిన వంశీ జైలు కెళితే ఏదో ప్రజల తరపున పోరాటం చేసిన వ్యక్తిలా అతన్ని పరామర్మించడం సిగ్గులేని జగన్‌కే చెల్లిందన్నారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దళితులపై యథేచ్ఛగా దమనకాండ సాగించారన్నారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి మృత దేహాన్ని డోల్ డెలివరీ చేశాడని గుర్తు చేశారు. అయినప్పటికీ బాధిత దళిత కుటుంబాలను ఒక్కసారిగా కూడా పలకరించని జగన్ రెడ్డి … రౌడీలు, దోపీడీ దొంగల కోసం మాత్రం జైలు యాత్రలు చేస్తున్నాడని విమర్శించారు. 2020 వరకు గన్నవరం నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరులా ఉందన్నారు. ఎప్పుడైతే అక్కడి స్థానిక ఎమ్మెల్యే వంశీ..వైసీపీ పంచన చేరాడో పరిస్థితులు భయంకరంగా మారాయన్నారు. వైసీపీ భావజాలాన్ని తలకెక్కించుకున్న వంశీ రౌడీయిజం చేయడం ప్రారంభించాడన్నారు. టీడీపీ ఆఫీసును తగుల బెట్టించాడని, దీనిపై ఫిర్యాదు చేసి, కేసు పెట్టిన దళితుడిని కిడ్నాప్ చేసి, కొట్టి, నానా హింసలు పెట్టి తప్పుడు స్టేట్‌మెంట్ ఇప్పించాడన్నారు. కాల్వలు, కొండలు, చెరువులు అన్నింటినీ మింగేసిన వంశీని మంచివాడని చెప్పడం ఒక్క జగన్ రెడ్డికి మాత్రమే చెల్లిందన్నారు. జగన్ రెడ్డి చేసిన పాపాలకు పరిహారం చెల్లించాల్సిందే.. గత ఐదేళ్లలో తప్పుచేసిన వారందరూ శిక్ష అనుభవించక తప్పదని మంత్రి అనగాని స్పష్టం చేశారు. వంశీ పార్టీ మారాక గన్నవరంలో చేసిన అరాచకాలు చూసి ప్రజలు ఎందుకు ఓటు వేసి గెలిపించామా అని బాధపడ్డారన్నారు. జగన్ అరాచకాలపై 8నెలలుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, తమకు వచ్చే గ్రీవెన్స్‌లు చూసైనా ఎన్ని పాపాలు చేశాడో గ్రహించి జగన్ బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.