- పోలీసులను బెదిరించేలా మాట్లాడటం సరికాదు
- ఇప్పుడున్న పోలీసులు మీ హయాంలో పనిచేసిన వారే
- చట్టాలను గౌరవించని వారికి పోలీసులు సెల్యూట్ చేయరు
- పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం
విజయవాడ (చైతన్యరథం): మాజీ సీఎం జగన్ పోలీసులపై బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు హితవు పలికారు. పోలీసులనుద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిరచారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, పోలీసు అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలూడదీసి నిలబెడతామని మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరించేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత ఎనిమిది నెలల కిందట వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన వారేననే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయాలకు, వర్గాలకు, రాగద్వేషాలకు అతీతంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడిరచారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారి పోయిందని వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పోలీసులు ఎప్పుడూ చట్టానికి, ధర్మానికి, న్యాయానికి, సత్యానికి సంకేతాలైన ఆ నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తారని స్పష్టం చేసారు. చట్టాలను ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయరన్నారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని జిల్లా జైలులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ములాఖత్‌లో మంగళవారం జగన్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… వంశీని తప్పుడు కేసుల్లో అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.