కొండపి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం పేదల వైద్యం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం నాడు ప్రకాశం జిల్లా కొండపిలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఆస్పత్రిలోని అన్ని వార్డులు తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో పలు రికార్డులు పరిశీలించి, అక్కడ అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….. పేదల వైద్యం, ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్త్తుందని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. కొండపి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన పరికరాల్ని సమకూర్చి త్వరలోనే ఇక్కడే ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. దీనివల్ల ప్రజలపై ఆర్థిక భారం తగ్గి జరుగుమల్లి, కొండపి, మర్రిపూడి మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. ఆసుపత్రిలో చిన్న పిల్లల వార్డు ఏర్పాటు చేస్తామని, రోగుల బెడ్ల వరకు ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చూస్తామన్నారు. గుండెపోటుకు ఈ ఆస్పత్రిలోనే వైద్యులు ప్రథమ చికిత్స అందించేందుకు అన్ని పరికరాలు ఉన్నాయని, గుండెపోటుకు గురైన వారు సుదూర ప్రాంతాలకు వెళ్లేముందు ఇక్కడికి వచ్చి ప్రథమ చికిత్స చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి థియేటర్ లైట్ ని ఉచితంగా అందజేసిన రమేష్ సంఘమిత్ర ఆసుపత్రి యాజమాన్యానికి మంత్రి అభినందనలు తెలిపారు.
జీబీఎస్ వ్యాధి కొత్తగా వచ్చింది కాదని, దీనిపై ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. ఈ వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని, ఎవరికైనా జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వైద్యులు వెంటనే జీజీహెచ్‌కి పంపించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి డోలా సూచించారు.