- సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వంలో శ్రీకారం
- ప్రతి ఎకరాకు నీరందించడమే ధ్యేయం
- సమర్థ నీటి వినియోగంతోనే రాష్ట్రం సస్యశ్యామలం
- అఖిల భారత ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో మంత్రి నిమ్మల
ఉదయ్‌పూర్ (చైతన్యరథం): నదుల అనుసంధానం, నీటి వనరుల సమర్థ వినియోగంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అఖిల భారత స్థాయిలో జరుగుతున్న 2వ రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల మొదటి రోజు సమావేశంలో మంగళవారం మంత్రి రామానాయుడు మాట్లాడారు. ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు ఏనాడో చెప్పిన నదుల అనుసంధాన ప్రక్రియకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో ఏపీలో శ్రీకారం చుట్టామని మంత్రి రామానాయుడు తెలిపారు.
విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు కోట్ల ఎకరాల భూ విస్తీర్ణం ఉండగా అందులో రెండు కోట్ల ఎకరాలు వ్యవసాయ యోగ్యంగా ఉందని చెప్పారు. రెండు కోట్ల ఎకరాల విస్తీర్ణంలో కోటి ఎకరాలకు ఇంకా నీటి వసతి కల్పించాల్సి ఉందన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందించి రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి రామానాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జల చిత్రాన్ని ఆయన వీడియో రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని నీటి వనరులు, చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, జరుగుతున్న పనులు సవివరంగా తెలియజేశారు. వికసిత్ భారత్` 2047లో భాగంగా జల సంరక్షణ అంశాలపై రాష్ట్రంలో చేపట్టబోయే పనులను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలోనే మొదటిసారిగా 2017లో ఏపీ వారీమ్స్ టెక్నాలజీని ప్రవేశపెట్టి, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాటర్ మేనేజ్మెంట్ చేసి సమర్థనీటి వినియోగాన్ని సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని తెలిపారు. ఈ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా గతంలో కంటే ఈ ఏడాది రిజర్వాయర్లలో అదనంగా 53శాతం నీటి నిల్వ చేయగలిగామని వివరించారు. స్వర్ణాంధ్ర -2047లో భాగంగా అమలులోకి తీసుకొచ్చిన వాటర్ పాలసీ ద్వారా భూగర్భ జలాలు పెంపొందించడం, డ్రిప్, పైప్డ్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తున్నామన్నారు.
రాష్ట్ర దశ, దిశ మార్చే పోలవరం
గోదావరి నదిపై నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు అత్యంత విశిష్టమైనదిగా మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. అత్యంత ఎక్కువ సామర్థ్యంతో.. 50 లక్షల క్యూసెక్కుల వరద డిశ్చార్జి సామర్థ్యంతో 1128 మీటర్ల పొడవైన స్పిల్‌వే నిర్మించినట్టు మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కృష్ణ, గోదావరి డెల్టాల స్థిరీకరణ జరుగుతుందని, సుస్థిర వ్యవసాయం సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. తద్వారా రాష్ట్ర దశ, దిశ మారగలదన్నారు. రాష్ట్రంలోని సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం మరో 85 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశమే కారణమని చెప్పారు. భూగర్భ జలాల్ని కొలిచేందుకు 1810 జియో మీటర్లు ఏర్పాటు చేశామని, దేశంలోనే తొలిసారిగా బోర్ వెల్స్‌కు కూడా జియో ట్యాగ్ చేసి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జల సంరక్షణకు సంబంధించి, నీటి పొదుపు, వృథాను అరికట్టడం, వంటి చర్యలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను గణాంకాలతో సహా మంత్రి రామానాయుడు వివరించారు.
గరిష్ఠ నీటి వినియోగానికి కార్యాచరణ
వికసిత భారత్ `2047 లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా, అన్నపూర్ణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్ణయించి ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారని మంత్రి రామానాయుడు చెప్పారు. ఏపీలో ఉన్న ఐదు ప్రధాన నదులు, 35 మైనర్ నదుల నుంచి జలాలని గరిష్ఠంగా వినియోగించుకుని రాయలసీమ లాంటి కరవ ప్రాంతాలకు నీటిని తరలించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడిరచారు.
ఆర్థికంగా సహకరించాలి
రాష్ట్రంలోని జలవనరుల అభివృద్ధికి, నీటి సంరక్షణకు, నీటి పొదుపు చర్యలకు, ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన సాగేందుకు ప్రధాని మోదీ, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అందిస్తున్న సహాకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్న చొరవకు, ఇస్తున్న ప్రోత్సాహకానికి రామానాయుడు కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు, రాష్ట్రానికి సంబంధించిన మరి కొన్ని ప్రతిపాదిత నీటిపారుదల ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో ఆర్థిక సహాకారంతో పాటు, అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని వేదికపైనున్న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను, ఉన్నతాధికారులను మంత్రి రామానాయుడు కోరారు.