- భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించాలని ఆకాంక్ష
- కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని భరోసా
అమరావతి(చైతన్యరథం): జేఈఈ మెయిన్స్‌లో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించిన అంబేద్కర్ గురుకుల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజ నేయ స్వామి అభినందించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా డోలా విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని పేర్కొన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థుల ను మిగతా విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని మరింత మంది జేఈఈలో భవిష్యత్తులో ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. ప్రతీ సంక్షేమ, గురుకులాలు వసతిగృహాల్లో కూడా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ వసతిగృహాలకు నిర్వహణ నిధులు కూడా కేటాయించలేదని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత రూ.143 కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేస్తున్నామని వివరిం చారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ ఫలితాల్లో గురుకులాలు, సంక్షేమ వసతిగృహా ల్లో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సిబ్బంది కృషిచేయాలని కోరారు. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం, భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్య దర్శి ఎం.ఎం.నాయక్, కార్యదర్శి లావణ్య వేణి, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.