- గుంటూరులో చికిత్స పొందుతూ మహిళ మృతి
- ఆందోళన వలదన్న మంత్రి డోలా
గుంటూరు (చైతన్య రథం): ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ గులియన్-బారీ సిండ్రోమ్ (జీబీఎస్)తో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుపడి పోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాధితురాలు ఇవాళ సాయంత్రం కన్నుమూసింది. కమలమ్మ మృతిని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి ధ్రువీకరించారు.
అరుదుగా లక్షమందిలో ఒకరిద్దరికే వచ్చే జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో ఇటీవల ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి (జీజీహెచ్) ఈనెల 11న ఒక్కరోజే ఏడు కేసులు వచ్చాయి. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాలనుంచి నలుగురు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ముగ్గురు ఈ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వారిలో ఇద్దరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అదేవ్యాధితో కాకినాడలో ఇటీవల ఇద్దరు చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ వ్యాధితో 17మంది చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా… అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇది ఒకరకంగా పక్షవాతంలాంటిదే. చాలావరకు ఇతరత్రా ఇన్ఫెక్షన్లు వచ్చిన వారికే మొదలవుతుంది. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయి. వ్యాధి లక్షణాల్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ప్రమాదకరం కాకముందే నయం చేయవచ్చు. ముఖ్యంగా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుంది. పెద్దవారికే వచ్చే ఈ వ్యాధి.. ఇప్పుడు పిల్లలు, శిశువులకూ సోకడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రాణాంతకం కాదు గానీ..
ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా… సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే ప్రమాదం సంభవిస్తుంది. ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినా, కలుషితమైన నీరు, ఆహారం తీసుకున్నా, పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నా ఈ వ్యాధి సోకే అవకాశాలున్నాయి. దీన్ని ముందుగా నిరోధించలేం. కాళ్లు, చేతుల్లో బలహీనత కనిపిస్తే.. కొద్దివారాల ముందు విరేచనాలు, కడుపునొప్పి ఉన్నాయా అనేది చూడాలి. జీబీఎస్ లక్షణాలున్నాయని అనుమానిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. నర్వ్ కండక్షన్, ఎలక్ట్రోమయోగ్రఫీ, సీఎన్‌ఎఫ్, ఎంఆర్‌ఐవంటి పరీక్షల ద్వారా… వ్యాధిని వైద్యులు నిర్ధారిస్తారు.
వ్యాధి లక్షణాలు
వేళ్లు, మడమలు, మణికట్టువంటి చోట్ల సూదులతో పొడుస్తున్నట్టు అనిపించడం. కాళ్లలో మొదలైన బలహీనత పైకి విస్తరించడం, కాళ్ల నొప్పులు. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, మంటగా అనిపించడం, సరిగ్గా నడవలేకపోవడం, తూలడం, మెట్లు ఎక్కలేకపోవడం. నోరు వంకరపోవడం, మాట్లాడడం, నమలడం, మింగడంలో ఇబ్బంది. మెడ నిలబడకపోవడం, ముఖ కండరాల్లో కదలిక లేకపోవడం. ఒకటికి రెండు దృశ్యాలు కనిపించడం. కళ్లు కదిలించలేకపోవడం, పూర్తిగా మూయలేకపోవడం, వ్యాధి తీవ్రమైతే శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది అవుతుంది. వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందించాలి. కొందరిలో గుండె వేగం అస్తవ్యస్తమవడం, రక్తపోటులో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. కొందరిలో అరుదుగా విపరీతంగా చెమటలు పడతాయి.
నివారణ చర్యలు ఇవీ..
కాచి, వడబోసిన నీళ్లను తాగాలి. కూరగాయలు, పళ్లు ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగాకే వాడాలి. మాంసంలాంటి పదార్థాల్ని 75 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పూర్తిగా ఉడికేలా వండుకోవాలి. పచ్చిగుడ్లు తినకూడదు. చేపలు, రొయ్యలు, పీతలనూ పూర్తిగా ఉడికించి తినాలి. వంట చేసేటప్పుడు, భోజనం చేసేముందు, మలవిసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మాంసం పదార్థాల్ని కడిగిన, కోసినచోట వేడినీటితో శుభ్రం చేయాలి.
ఆందోళన వద్దు: మంత్రి డోలా
ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ గులియన్-బారీ సిండ్రోమ్ ఆదివారం మృతి చెందింది. ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేస్వామి స్పందించారు. జీబీఎస్ వ్యాధిపట్ల ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘జీబీఎస్ అంటువ్యాధి కాదు. వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే డాక్టర్లు వెంటనే వైద్యం అందించాలి. దీనిపై ఇప్పటికే సీఎం సమీక్షించారు. ప్రజారోగ్య సంరక్షణ కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. వ్యాధిపట్ల ప్రజల్లోవున్న అపోహలు తొలగించాలి’’ అని మంత్రి ఆదేశించారు.