తిరుపతి (చైతన్య రథం): తితిదే లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ వేదికగా నెయ్యి ట్యాంకర్లు పంపిన బోలేబాబా డెయిరీల మధ్య ఒప్పందం ఎప్పుడు కుదిరింది? ఎలా కుదిరింది? మరింత ఆదాయం కోసం కల్తీకి పాల్పడిరది ఎవరెవరు? ఎంతెంత వాటా తీసుకున్నారనే ప్రశ్నలను సిట్ సంధించింది. కస్టడీకి తీసుకున్న ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్, బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావడాలను మూడోరోజు తిరుపతిలోని సిట్ తాత్కాలిక కార్యాలయంలో విచారించారు. నిందితులను కస్టడీకి తీసుకొని 48 గంటలు పూర్తికావడంతో రుయా ఆస్పత్రిలో ఆదివారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, మధుమేహం అదుపులో ఉందని, ఆరోగ్యం నిలకడగా ఉందని పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. రాజు రాజశేఖరన్ మాత్రం గుండె సంబంధిత మందుల వాడకం కొనసాగించాలని వైద్యులు సూచించారు.
ఆస్పత్రినుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన నలుగురిని మొదట వేర్వేరుగా విచారించిన అధికారులు అనంతరం అందరినీ కలిపి విచారించారు. రెండు రోజులుగా జవాబులు ఇవ్వని ప్రశ్నలను మరోసారి అడిగారు. స్వచ్చమైన.. సరిపడేంత నెయ్యి తితిదేకు సరఫరా చేసే సామర్థ్యంలేని ఏఆర్ డెయిరీ తక్కువ ధర కోట్ చేస్తే.. సామర్థ్య పరిశీలన లేకుండా అప్పగించడంలో ఎవరి పాత్ర ఉందని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 2019లో బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ తితిదేకి నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్నా…. డైరీ సామర్థ్యం లేదని తితిదే కొనుగోలు కమిటీ నిర్ధారణతో టెండర్ రద్దు చేశారు. దీంతో ఆ డెయిరీకి సంబంధించిన విపిన్ జైన్, పొమిల్ జైన్ శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాక వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా చేరి తమ నెయ్యిని తితిదేకు సరఫరా చేసేందుకు పన్నిన కుట్రల గురించి సిట్ అధికారులు ఆరా తీశారు.