- ప్రజాసేవే పరమావధిగా సేవా కార్యక్రమాలు
- విస్తృతమైన సేవలతో ప్రజల మనసులు గెలిచిన ట్రస్ట్
- అనాథలు, ఆపన్నులకు ఉచిత వసతితో కూడిన విద్య
- ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలోనే బ్లడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు
- యుఫోరియా మ్యూజికల్ నైట్‌లో మంత్రి నారా లోకేష్
విజయవాడ (చైతన్యరథం): ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదవారి ముఖంలో చిరునవ్వు, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే నమ్మకం అని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు ఆలోచన, భువనేశ్వరి ఆచరణే ఎన్టీఆర్ ట్రస్ట్ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా బాధితుల కోసం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్‌లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తలసీమియా బాధితులకు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. 1997లో ఒక్క అడుగుతో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రయాణం ప్రారంభమైంది. 28 ఏళ్ల ప్రస్థానంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, సురక్షిత తాగునీరు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగు ప్రజల మనస్సు గెలుచుకుంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రజల్ని అందరి కంటే ముందు పలకరించేది, సాయం అందించేది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తితో మహిళలు సొంత కాళ్ళ పై నిలబడే శక్తిని ఇచ్చింది ఎన్టీఆర్ ట్రస్ట్ అని పేర్కొన్నారు.
ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు అండగా…
ఫ్యాక్షన్ హింసకు గురైన అనేక కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశాజ్యోతిగా నిలిచింది, వారికి విద్య, ఆర్థిక మద్దతును అందిస్తోంది. నా పాదయాత్రలో.. ట్రస్ట్ చాలా మంది చిన్న పిల్లల జీవితాలను ఎలా మార్చేసిందో నేను ప్రత్యక్షంగా చూశాను. అనంతపురానికి చెందిన శ్రావణి అనే యువతి నన్ను కలిసింది. వీరి తండ్రి తగరకుంట ప్రభాకర్ ఫ్యాక్షన్ హింసలో మృతి చెందారు. శ్రావణి, ఆమె ఐదుగురు తోబుట్టువులు ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో విద్యను అభ్యసించారు, వారిలో నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అయ్యారు. చిన్నవారైన శ్రావణి ఇప్పుడు బెంగళూరులో పని చేస్తోంది, ఇది ట్రస్ట్ సేవల సానుకూల ప్రభావానికి నిదర్శనం. మౌనిక అనే యువతి నన్ను అనంతపురంలో కలిసింది. ఫ్యాక్షన్ హింసలో ఆమె తండ్రి శ్రీనివాస్ గౌడ్ చనిపోయారు. మౌనిక, ఆమె సోదరి, నాగమణి, ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో చదువుకున్నారు, నాగమణి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. మౌనిక వ్యవసాయ శాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేసిందని మంత్రి లోకేష్ తెలిపారు.
వరదబాధితులకు ఆపన్నహస్తం
అధికారంతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని మంత్రి లోకేష్ కొనియాడారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో 510 మంది తెలుగు ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చిన చంద్రబాబునాయుడు జెట్ లాగ్‌లో ఉన్నప్పటికీ వేగంగా స్పందించారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన తెలుగు ప్రజలను రక్షించి స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. వరద బాధితులను విమానాశ్రయం నుండి వారి వారి గ్రామాలకు చేర్చడానికి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్పందించడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చురుకైన పాత్ర పోషిస్తోంది. ఉత్తరాఖండ్ వరదలు, హుద్ హుద్ తుఫాన్, తిత్లీ తుఫాన్‌చ కర్నూలు వరదలు, గోదావరి వరదలు, గత ఏడాది విజయవాడ వరదల సమయంలో బాధితులకు అండగా నిలచింది. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన సమయంలో 48 బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఆపన్నులకు అండగా నిలుస్తూ సహాయక చర్యల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుంది. అవసరమైన వారికి సకాలంలో సమర్థవంతమైన సేవలను అందిస్తోందని మంత్రి లోకేష్ వివరించారు.
ఆరోగ్యసేవల్లో మేటి ఎన్టీఆర్ ట్రస్ట్
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి బాధితులను ఆదుకోవడాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ సవాలుగా స్వీకరించింది. క్లిష్టమైన సమయంలో అవసరమైన వారికి అండగా నిలచింది. మాస్క్‌లు, మందులు, ఆక్సిజన్‌ను పంపిణీ చేశాం. కోవిద్ బాధితుల ప్రాణాలను రక్షించడానికి ట్రస్ట్ కార్యకర్తలు అహరాహం శ్రమించారు. మా ప్రయత్నాలు అక్కడితో ఆగలేదు. కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియల కోసం కూడా మేము సాయం అందించాం. దానాలన్నింటిలో కీలకమైన రక్తదానంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కీలకపాత్ర వహిస్తోంది. ఇప్పటివరకు 8.70 లక్షల మంది రోగులకు రక్తాన్ని అందించడం ద్వారా ట్రస్ట్ లక్షలాది బాధితుల ప్రాణాలను కాపాడిరది. తలసేమియా, జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతున్న 200 మంది పిల్లలు ట్రస్ట్ నుండి రక్తాన్ని పొందుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ మందులను కూడా అందిస్తోంది.
ఇప్పటివరకు 13వేల ఆరోగ్య శిబిరాలు, రూ.23 కోట్ల విలువైన మందులను పంపిణీ చేసింది. ట్రస్ట్ ఆధ్వర్యాన సంజీవని ఆరోగ్య క్లినిక్‌లు, నాలుగు మొబైల్ బస్సులను నడుపుతున్నాం. అవసరమైన వారికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్నాం. 2,020 మంది అనాథలకు పూర్తిగా ఉచిత వసతి, విద్యను ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తోంది. స్త్రీ శక్తి కార్యక్రమం కింద టైలరింగ్ శిక్షణ ద్వారా 7,531 మంది మహిళలు ప్రయోజనం పొందారు. త్వరలోనే మరిన్ని బ్లడ్ బ్యాంకులు, బ్లడ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిరంతరం ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి, ట్రస్ట్ టీమ్, సంగీత దర్శకుడు తమన్, హాజరైన వారందరికీ మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.