- వైసీపీకి ఓటు అడిగే హక్కు లేదు
- ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్క మంచి పనీ చేయలేదు
- ఉపాధ్యాయులకు బార్‌లు, బాత్రూముల దగ్గర విధులు సిగ్గుచేటు
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షలో పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి
తాడేపల్లిగూడెం/తణుకు (చైతన్యరథం): ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయమని పట్టభద్రులను, ఉపాధ్యాయులను అడిగే హక్కు వైఎస్సార్ సీపీకి లేదని పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో తాడేపల్లిగూడెం, తణుకుల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పలు అంశాలపై కూటమి నేతలకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదన్నారు. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని దుయ్యబట్టారు. ఎంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారితో బార్‌లు, బాత్రూముల దగ్గర విధులు చేయించి పవిత్రమైన వృత్తికి కళంకం తెచ్చారని, గురువులను మానసిక క్షోభకు గురి చేశారని మంత్రి మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. చెప్పినవన్నీ చేస్తామని… చేయలేని పనులను ఎప్పుడూ కూటమి చెప్పదని మంత్రి గొట్టిపాటి వెల్లడిరచారు.
పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి జగన్‌కు ఐదేళ్లు పట్టిందని ఎద్దేవా చేసిన ఆయన., కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క సంతకంతో వెయ్యి రూపాయలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అన్నారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి రోడ్ల నిర్వహణకు ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడంతో.. రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో… పక్క రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా హేళన చేసిన విషయాన్ని గొట్టిపాటి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత యుద్ధ ప్రాతిపదికన రూ.వెయ్యి కోట్లతో రాష్ట్రంలో రహదారులకు మరమతులు చేశామని తెలిపారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు పునరుద్ధరించి, మహిళలకు ఉచిత గ్యాస్ అందిస్తున్నామన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తవ్వగానే డీఎస్సీ నిర్వహించి 17,500పైగా టీచర్ పోస్టుల భర్తీతో పాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవను కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలన కారణంగా ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా ఉన్నా… కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
ఏడు నెలల అభివృద్ధి చెప్పి ఓటు అడగండి
ఐదేళ్ల జగన్ విధ్వంసంతో నాశనమైన వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని వాటిని వివరించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. కూటమి అభ్యర్థి రాజశేఖర్ అన్ని ప్రాంతాలకూ వెళ్లలేరని, కూటమి నేతలే విద్యావంతులైన పట్టభద్రుల ఓటర్లను ఒక్కొక్కరినీ కనీసం మూడు నాలుగు సార్లు కలిసి ఓటు వేయాలని ధైర్యంగా అడగాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో నిరుద్యోగులకు.. ఒక్క ఉద్యోగాన్నీ ఇవ్వకపోగా… పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చిన అనేక పెద్ద పెద్ద సంస్థలను వేధింపులతో బయటకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు అడిగే హక్కు కేవలం కూటమి అభ్యర్థికే ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల కాలంలోనే.. ప్రతిపక్ష వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, విద్యావంతులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు జగన్ ట్రాప్‌లో పడొద్దని మంత్రి గొట్టపాటి హితవు పలికారు.
గురువులను అవమానించిన జగన్..
వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి దైవ సమానులైన ఉపాధ్యాయులను తీవ్రంగా అవమానించారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గురువులను బోధన నుంచి దూరం చేసి… బార్లు, మరుగుదొడ్ల వద్ద విధులు చేయించిన దుర్మార్గుడు జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం చేస్తున్నామని తెలిపారు. మంత్రి లోకేష్ సారథ్యంలో అమలు చేస్తున్న సంస్కరణలతో పేదలకు మరింత మెరుగైన విద్య అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ చేస్తున్న అనవసర రాద్ధాంతమంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన తేల్చి చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించి మరింత మెరుగైన వసతులు కల్పిస్తామని వెల్లడిరచారు.
ఓటు వేయడంలో అవగాహన కల్పించండి….
సాధారణ ఎన్నికల కంటే భిన్నంగా ఉండే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఓటర్లకు అవగాహన కల్పించాలని కూటమి నేతలకు మంత్రి గొట్టపాటి దిశా నిర్దేశం చేశారు. ఒక్క ఓటు కూడా వృథా కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రంలో ఇచ్చే పెన్నుతోనే ఒక నిలువు గీత పెట్టాలని, బ్యాలెట్ పేపర్ మడతపెట్టే విషయంలోనూ జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. అదే విధంగా రెండో ప్రాధాన్యతా ఓటు విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండో ఓటు ఎవరైనా వేయమని అడిగినా ఎవరికీ వేయవద్దని ఓటర్లకు తెలిసేలా ప్రచారం చేయాలని కూటమి నేతలకు మంత్రి గొట్టిపాటి సూచించారు. తన శాఖకు సంబంధించి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.