విజయవాడ (చైతన్యరథం): దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలుకెళ్లారని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వంశీపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. తప్పు చేసిన వైసీపీ నేతలు శిక్ష తప్పించుకోలేరని లోకేష్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ అరాచక పాలనను అందరూ చూశారని, ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. విశాఖ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ శనివారం మీడియాతో మాట్లాడారు. 2019 -2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పాలన జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేతలు, ప్రజా నాయకులు వెళితే వారిని ఇబ్బందులకు గురి చేసి వేధించారన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతైన చంద్రబాబు నాయుడిని సైతం బయటకు రానివ్వకుండా ఇంటి గేట్లను తాళ్లతో కట్టారని గుర్తుచేశారు.
ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే కేసులు పెట్టారని మండిపడ్డారు. జగన్ సర్కార్ హయాంలో మంగళగిరి, గన్నవరం టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారని ఆగ్రహించారు. ఓ ఎస్సీ వ్యక్తిని కిడ్నాప్ చేసి, బెదిరించి కేసు విత్ డ్రా చేయించిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వంశీ అని లోకేష్ మండిపడ్డారు. అన్ని విషయాలూ త్వరలో బయటకు వస్తాయని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రత్యక్షసాక్షి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్. ఆయనే ఆ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ, అతని అనుచరులు ఇటీవల సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి, బెదిరించారు. బాధితుల ఫిర్యాదుతో కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు.