- దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపులు కనిపించలేదా
- చట్ట ప్రకారమే వల్లభనేని వంశీ అరెస్ట్
- రౌడీలు, గూండాలు, గంజాయి, డ్రగ్స్ జగన్ బ్రాండ్
- అరాచకాల అణిచివేత చంద్రబాబు బ్రాండ్
- రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కచ్చితంగా అమలు
అమరావతి (చైతన్యరథం): వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో జగన్‌రెడ్డి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వల్లభనేని వంశీ అరాచకాలు, రౌడీయిజాన్ని జగన్ రెడ్డి ఖండిరచకపోగా… పొగడటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అరాచక వాది జగన్.. మరొక అరాచక వాది వంశీని వెనకేసుకురావడం చూసి రాష్ట్రం మొత్తం అసహ్యించుకుంటోందన్నారు. ఇలాంటి విష సంస్కృతి కలిగిన జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశాడు. ఈ రోజు సాక్షుల గురించి జగన్, వైసీపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు. సాక్షుల్ని బెదిరించడం, సాక్షులు చెప్పిన దాన్ని తారుమారు చేయడం, నేరాన్ని ఎదుటి వారి మీద వేయడం జగన్ నైజం. గతం నుంచీ ఆయన తీరు అదే. జగన్ కేసుల్లో కూడా సాక్షుల్ని బెదిరించడం, లేదా చంపేయడం చూస్తూనే ఉన్నాం. నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి మరొక నేరం చేసిన వల్లభనేని వంశీ దుర్మార్గాన్ని ఖండిరచకపోగా, అతనికి వత్తాసు పలకడం చూసి రాష్ట్ర ప్రజలందరూ చీదరించుకుంటున్నారు. జగన్ రెడ్డిని ఒకటే సూటిగా అడుగుతున్నాం. ఆ రోజు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రత్యక్షసాక్షి అయిన దళిత యువకుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి, చంపేస్తామని బెదిరించి, వంశీ కారులోనే కోర్టు దగ్గరికి తీసుకొచ్చి తప్పుడు వాంగ్మూలం ఇప్పించడం ఎంతవరకు సమర్థనీయం. దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని మంత్రి రామానాయుడు సవాల్ విసిరారు.
చట్ట ప్రకారమే అరెస్ట్
ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి విశాఖపట్టణంలో వంశీ ఆధీనంలో పెట్టుకుంటే జగన్‌రెడ్డి ఎందుకు ఖండిరచలేకపోతున్నాడు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆ రోజు వంశీ, అతడి అనుచరులు తగలబెట్టి, సిబ్బంది మీద దాడి చేసి, ఆఫీసు వెలుపల ఉన్న వాహనాలను ధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా. దాడి సంఘటన తెలుసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుంటే… వాళ్ల మీద గుండాలు, రౌడీలతో రాళ్ల దాడి చేసింది మాట వాస్తవం కాదా. పైపైచ్చు బాధితుల మీదే ఎదురు కేసులు పెట్టారు. మహిళ అని కూడా చూడకుండా సాయికళ్యాణిని అరెస్ట్ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లి, కనీసం దుస్తులు కూడా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. నేడు ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి, చంపుతానని బెదిరించి దౌర్జన్యం చేశారు. దీనిపై అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారించుకుని వంశీని అరెస్ట్ చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే అక్రమ కేసులంటూ జగన్, వైసీపీ నేతలు గగ్గోలు పెట్టటంలో అర్థం లేదు. దళితుడిని భయభ్రాంతులకు గురి చేసి, మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా గతంలో మాట్లాడిన వంశీని జగన్ వెనకేసుకు వస్తున్నారు. దళితుల పట్ల, మహిళల గౌరవం పట్ల జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేందుకు ఇదే నిదర్శనమని మంత్రి నిమ్మల దుయ్యబట్టారు.
నేరస్థుల భరతం పడతాం
ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్యం పోతుంది మళ్లీ జన రాజ్యం వస్తుందని మేము చెప్పాం. దాని ప్రకారం ఇవాళ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు చేస్తున్నాం. ఈ రోజు చట్టం తన పని తను చేసుకుంటూ పోతోంది. తెలుగుదేశం పార్టీకి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్‌లో పెట్టడం కొత్త కాదు. గతంలో రాష్ట్రంలో నేరాలపై ఉక్కుపాదం మోపిన విధంగానే.. నేడు రాజకీయ ముసుగులో ఉన్న జగన్మోహన్ రెడ్డి నేర సామ్రాజ్యాన్ని కూడా అదేవిధంగా అంతమొందిస్తాం. నేరగాళ్లు, రౌడీయిజం, అత్యాచారాలు, డ్రగ్స్ వంటివి నిలువరించి స్వచ్ఛమైన పరిపాలన అందించడం చంద్రబాబు బ్రాండ్. రౌడీలు, గుండాలు, డ్రగ్స్, గంజాయి వీటిని ప్రోత్సహించి పరిపాలన సాగించడం జగన్ రెడ్డి బ్రాండ్. చంద్రబాబు బ్రాండ్‌కి జగన్ రెడ్డి బ్రాండ్‌కి చాలా తేడా ఉంది. జగన్ బ్రాండ్ అంటే ఏమిటి అనేది గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే వెల్లడయింది. అయినా కూడా పాఠాలు నేర్చుకోకుండా జగన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యం అని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులు, రౌడీలు, గుండాల భరతం పడతాం. విజయ్ మాల్యా అవినీతికి పాల్పడి దేశాన్ని వదిలి పారిపోయిన పరిస్థితి చూశాం. కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతితో లక్షల కోట్ల సొమ్ముని సంపాదించిన జగన్ రెడ్డి…ఆ సొమ్ముతో పార్టీ పెట్టి మరీ ఇక్కడ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడం మన దురదృష్టకరం. ఏది ఏమైనా మా ప్రభుత్వం కచ్చితంగా చట్ట ప్రకారమే పని చేస్తుందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు