- సస్య శ్యామల ఏపీ చంద్రబాబుతోనే సాధ్యం
- బీసీ సంక్షేమ మంత్రి సవిత స్పష్టం
గొల్లపల్లి (చైతన్య రథం): రాయలసీమ కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేయడమే కూటమి లక్ష్యమని చేనేత మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం గొల్లపల్లి రిజర్వాయర్‌కు ఆమె గంగ పూజ చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ రిజర్వాయర్ ద్వారా సాగు, తాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ప్రతి నెలా ఒకటినే రూ.4000 పింఛను అందిస్తోందని, దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయలేని పథకాన్ని కూటమి అమలు చేస్తోందన్నారు. త్వరలో తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, రైతు భరోసా మిగతా సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్టు మంత్రి సవిత స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా తొలి ఐదు సంతకాలలో ఒకటిగా మెగా డిఎస్సీపై పెట్టారని గుర్తు చేస్తూ.. మెగా డిఎస్సీతో నిరుద్యోగ యువతలో మానసిక స్థయిర్యాన్ని నింపారన్నారు. ఎన్నికల మేనిఫెస్టో హామీలను దశలవారీగా అమలు చేయనున్నట్టు చెబుతూ.. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాల్వలను వెడల్పు చేయడానికి సుమారు రూ.3650 కోట్ల నిధులతో పనులకు శ్రీకారం చుడుతున్నట్టు చెప్పారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాల్వ ద్వారా కుప్పం వరకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపడుతున్నామని, పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. ఒకపక్క పోలవరం ప్రాజెక్టు పనులు మరొకపక్క అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇల్లులేని నిరుపేదలందరకు ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం ద్వారా గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. సొంత స్థలమున్న నిరుపేదలందరికీ గృహ నిర్మాణం జరుగుతుందని మంత్రి సవిత హామీ ఇచ్చారు.