అమరావతి (చైతన్య రథం): గిరిజనుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, గిరిజన హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బొరగం మాట్లాడారు. 1/70 చట్టం గురించి ఆదివాసీలు అపోహలు పెట్టుకోవద్దని అంటూనే.. జీఓ 3ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం, వారి అభివృద్ధికి కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ 1985లో జీఓ 275 ఇచ్చి గిరిజన హక్కుల సంరక్షణకు కృషి చేశారని, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు 2000లో జీఓ 3ను పునరుద్ధరించి గిరిజనుల్లో మనో ధైర్యాన్ని నింపారన్నారు. వైసీపీ ప్రభుత్వం జీఓ 3ను రద్దు చేస్తే.. కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయకపోవడం శోచనీయమన్నారు. వైసీపీ ప్రభుత్వానికి గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బొరగం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఆదివాసీలను అన్ని విధాలుగా అణగదొక్కాలని చూసిందని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలందరికీ మౌలిక సదుపాయాలు, రోడ్లు, వంతెనలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబుదని, ఆదివాసీల కోసం పనిచేసే చంద్రబాబుకు ఎంతో రుణపడి ఉన్నామన్నారు. నారా లోకేష్ పాదయాత్ర సమయంలో జీవో 3 పునరుద్ధరణకు స్పష్టమైన హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇచ్చిన హామీ మేరకు జీఓ 3ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్రైకార్ ఛైర్మన్ బొరగం భరోసానిచ్చారు.
తాడేపల్లి ప్యాలెస్ నుంచి దుష్ప్రచారం
ఆదివాసీల కోసం పనిచేసే కూటమి ప్రభుత్వంపై జగన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బురద జిమ్ముతున్నాడని గిరిజన నాయకుడు ధారూనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, గిరిజన సంక్షేమ మంత్రి ఇప్పటికే 1/70పై స్పష్టత ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వంపై కక్షతోనే పులివెందుల ఎమ్మెల్యే జగన్.. గిరిజనులను పక్కదారిపట్టేంచే ప్రకటనలు చేయడం సిగ్గుచేటని ధారూనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డోలీ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రయత్నించిన చంద్రబాబుపై జగన్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నాడని దుయ్యబడుతూ.. గత ఐదేళ్లలో ఏనాడైనా జగన్‌రెడ్డి ఆదివాసీలను పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో గిరిజన గురుకులాలను నిర్వీర్యం చేశారని, జీఓ 3ను సుప్రీంకోర్టు కొట్టేస్తే.. జగన్‌లో కనీస చలనం లేదన్నారు. ఐటీడీఏలను జగన్‌రెడ్డి జేబుసంస్థల్లా వాడుకుని అవినీతికి అడ్డగా మార్చారన్నారు. గిరిజనులకు ఉచిత విద్యుత్ పథకాన్ని నిలిపేసిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి అని.. గత ఐదేళ్లలో గిరిజనులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో వైసీపీ ప్రభుత్వం పేట్రేగిపోయిందని.. అలాంటి పార్టీకి ఇప్పుడు గిరిజనుల గురించి మాట్లాడే అర్హత లేదని ధారూనాయక్ దుయ్యబట్టారు.