- వాట్సాప్‌లోనే అన్ని ధృవపత్రాలు
- క్యూఆర్ కోడ్ సహిత డిజిటల్ రేషన్ కార్డులివ్వబోతున్నాం
- శాఖలన్నీ డేటా లేక్‌తో అనుసంధానం కావాలి
- ఐటీ, ఆర్టీజీ మంత్రి నారా లోకేష్ వెల్లడి
అమరావతి (చైతన్య రథం): వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు కావాల్సిన అన్ని రకాల ధృవపత్రాలు పొందేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రజలకు సీమ్‌లెస్ సర్వీసులు అందజేయాలన్నదే తమ ఆశయమన్నారు. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా ఆయన వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలకు మనం కల్పిస్తున్న మంచి వేదికని, దాన్ని మరింత ప్రజోపయోకరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఆయా శాఖలన్నీ కూడా తమ డేటాను ఆర్టీజీఎస్‌లోని డేటా లేక్‌కు అనుసంధానం చేసి సహకారం అందివ్వాలని కోరారు. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయాలంటే ఆయా శాఖల సహకారం చాలా అవసరమన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కీలక ప్రక్రయ అన్నారు. అధికారులు తమ శాఖల్లో ఈ దిశగా సాంకేతికపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో అన్ని సేవలు ఆన్‌లైన్ చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. రేషన్ కార్డుల మొదలు అన్నీ ప్రజలకు సులభంగా ఆన్‌లైన్‌లోనే అందించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
రాబోయే రోజుల్లో పౌరులకు డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని, తద్వారా పౌరులు క్యూ ఆర్ కోడ్‌తోనే రేషన్ పొందే సదుపాయం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రజాభిప్రాయాన్ని, ప్రజల సంతృప్తి శాతాలను కూడా వాట్సాప్ ద్వారానే మదింపు వేసే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. అన్ని శాఖలు వాట్సాప్ గవర్నెన్స్‌లో ఇంటిగ్రేటెడ్ అవ్వాలన్నారు. ఒక పౌరుడు ఒక ఆలయానికి వెళ్లాలనుకుంటే వాట్సాప్‌లోనే ఆలయంలో దర్శనం, ఆర్జిసేవలు పొందడం, వసతి పొందడం, ట్రాన్స్‌పోర్టేషన్ అన్నీ కూడా అనుసంధానమవ్వాలన్నారు. ఇవన్నీ చేయాలంటే ఆయా శాఖలు తమ ఐటీ విభాగాలను సాంకేతికంగా మెరుగుపరచుకుని తమకు తగిన సహకారం అందివ్వాలని సూచించారు. అందరి భాగస్వామ్యం, సహకారంతోనే ఇది విజయవంతం చేయగలుగుతామని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.