- గత ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది
- కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను మళ్లించారు
- 2047నాటికి 15శాతం వృద్ధిరేటు మన లక్ష్యం
- తెలుగుజాతి నెంబర్-1గా ఉండాలి
- నాతోపాటు డిప్యూటీ సీఎం పవన్, ఎన్డీయే ఆలోచనా అదే
- ఫైళ్ల క్లియరెన్స్ స్థానాలు.. వ్యక్తులను ఎత్తి చూపడానికి కాదు
- మరింత సమర్ధవంతంగా పని చేసేందుకే..
- మాటలు చెప్పి ప్రజలను ఏమార్చే పాలకులు కనుమరుగు
- మంత్రులు, అధికారులుగా ప్రజలకు మేలు చేసే మంచి అవకాశం
- లక్ష్య సాధనకు సమష్టిగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
- మంత్రులు, కార్యదర్శులతో ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ‘ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టాను. గత మూడుసార్లు చూడనన్ని సవాళ్లు ఇప్పుడు చూస్తున్నా. అన్ని వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న వ్యవస్థలను సరిచేసి ట్రాక్‌లో పెట్టేందుకు ఎఫెక్టివ్‌గా పని చేశాం. ఇక స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో మంత్రులు, కార్యదర్శులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పనితీరు, ఫలితాలు, లక్ష్యాలు, ప్రణాళికలపై చర్చించారు.
ఉత్తమ పాలసీల రూపకల్పన, అమలు బాధ్యత మనదే
2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు. ఎప్పుడూ ఇలాంటి మ్యాండేట్ రాలేదు. గత ఐదేళ్ల విధ్వంస పాలనకు విసుగుచెంది కొత్త ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు ముందుకొచ్చి కూటమికి ఘన విజయం అందించారు. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రతి 3 నెలకు ఒకసారి కలెక్టర్లతో సమావేశం పెడుతున్నాం. పాలసీలు తయారు చేస్తాం… వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన పాలకులుగా మనపై బాధ్యత ఉంది. ఇతరులపై ఆధారపడితే కొత్త ఆలోచనలు రావు. నేను ప్రతి ఒక్క గంటా లెక్కిస్తున్నాను. 90 కేంద్ర ప్రాయోజిత పథకాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పథకాల అమలకు ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని చంద్రబాబు అన్నారు.
15శాతం వృద్ధి రేటుతో అగ్రభాగాన రాష్ట్రం
స్వర్ణాంధ్ర విజన్-2047ను మీ సహకారంతో విడుదల చేశాం. వికసిత్ భారత్ 2047 ద్వారా ఏం చేయబోతోందో కేంద్రం తెలియజేసింది. 2047నాటికి రాష్ట్రం అగ్రభాగాన ఉండేందుకు రాష్ట్రం చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ మనం కూడా డాక్యుమెంట్ విడుదల చేశాం. 15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నాం. సమర్ధవంతమైన నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగితే గ్రోత్ రేట్‌లో మార్పు ఉంటుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో 10 ప్రధాన సూత్రాలతో ముందుకెళ్తున్నాం. టెక్నాలజీని కూడా శాఖలు విరివిగా ఉపయోగించుకోవాలి. ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని ఇల్లు, నీళ్లు, గ్యాస్, టాయిలెట్, ఇంటిపై సోలార్ వంటివి సదుపాయాలు కల్పించాలి. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజ్, చెత్త సేకరణ చేసి హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అయినప్పటికీ గత పాలన విధ్వంసం వల్ల రెవెన్యూ పెరగడం లేదు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ మైనస్ 2.94లో ఉంది. ప్రతి సమస్య పరిష్కారానికి పాతపద్ధతుల్లో కాకుండా ఇన్నోవేటివ్‌గా ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ నిత్యం నేర్చుకోవడం అవసరం. అన్నీ తెలుసు అనే అహం ఉండకూడదు. కెపాసిటీ బిల్డింగ్ కోసం కర్మయోగితో ఒప్పందం చేసుకున్నా’మని చంద్రబాబు వివరించారు.
దస్త్రాల పరిష్కారంలో వేగం పెరగాలి
దస్త్రాల పరిష్కారంలో కొందరు 6 నెలలకు పైగా సమయం తీసుకుంటున్నారు. ఇది ఏవిధంగా సమర్ధనీయం.? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దస్త్రాల పరిష్కారంలో వేగం పెంచాలి. ఇటీవల విడుదల చేసిన ఫైళ్ల క్లియరెన్స్ స్థానాలు వ్యక్తులను ఎత్తి చూపడానికి కాదు… మరింత సమర్ధవంతంగా పని చేసేందుకు ఈ ర్యాంకులు విడుదల చేశాం. కేంద్ర బడ్జెట్‌ను మంత్రులు, కార్యదర్శులు అధ్యయనం చేసి, ఆయా శాఖలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టుకోగలరో చూసుకోవాలి. కేంద్రం బడ్జెట్‌లో ఆయా శాఖలు ఒక్కశాతం నిధులు తెచ్చుకోగలిగినా మార్పు చూపించవచ్చు. మార్చి నెలలోపు అన్ని విభాగాలు శాఖలకు చేయాల్సిన ఖర్చులు చేయడంతోపాటు యూసీలు సమర్పించాలని చంద్రబాబు సూచించారు.
కమర్షియల్ సాగులో మరింత ప్రోత్సాహం
కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఆ అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలి. వినూత్న మార్గంలో వ్యవసాయంలో ఏపీ ముందుకెళ్తోంది. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా రైతులు కూడా సాగు పద్ధతులు మార్చుకుంటున్నారు. ఆక్వా, హార్టీకల్చర్, పామాయిల్, కాఫీవంటి కమర్షియల్ సాగులో ముందుకెళ్తున్న వారికి ప్రోత్సాహకాలు అందించాలి. ఏఐ, టెక్నాలజీని అన్ని శాఖలు అనుసంధానం చేసుకోవాలి. 1995లో ఐటీని అడాప్ట్ చేసకున్నాం. ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకోవాలి. గృహ, ఆరోగ్యం, జల్‌జీవన్ మిషన్‌వంటి కొన్ని శాఖలు గత ప్రభుత్వంలో విధ్వంసమయ్యాయి. ప్రజలకు తాగునీరు అందించేందుకు కేటాయించిన జల్‌జీవన్ మిషన్ నిధులను గత ప్రభుత్వం మళ్లించింది. శాశ్వతంగా ఇంటింటికీ తాగునీరు అందిచాలన్న లక్ష్యంతో జల్‌జీవన్ మిషన్ కింద కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారు. జల్‌జీవన్ మిషన్ పనులు పూర్తి చేసేందుకు కొన్ని రాష్ట్రాలు లక్ష కోట్ల దాకా నిధులు రాబట్టుకున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంలో భాగంగా 15శాతం గ్రోత్ రేట్, 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా, 42 వేల డాలర్ల తలసరి ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.
చేతల్లో చూపించేవారికే ప్రజల్లో మనుగడ
1995నుంచి 2024 వరకు ఉన్న సమాచారాన్ని తీసుకుంటే… నాటి ఆలోచనా విధానం, అమలైన పాలసీలతోనే మెరుగైన ఫలితాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో భావితరాలు గుర్తించుకునేలా మన పాలసీలు, అమలు విధానం ఉండాలి. ఈ యేడాది మీ శాఖల్లో ఏం చేయబోతున్నారనేది ముందుగానే నిర్ధేశించుకోవాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా ప్రతి శాఖ పనిచేయాలి. గ్రామ, మండల స్థాయిలో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. నానుంచి గ్రామస్థాయి నాయకుడి వరకు, సీఎస్‌నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి. తెలుగుజాతిని నెంబర్ వన్ కావాలన్నది నాతోపాటు డిప్యూటీ సీఎం పవన్, ఎన్డీయే ఆలోచన. మాటలు చెప్పి ప్రజలను ఏమార్చే పాలకులు కనుమరుగువుతున్నారు. చెప్పింది చేసి చూపించే వారే ముందుకు రాగలుగుతున్నారు. చేతల్లో చూపించేవారికే ప్రజల్లో మనుగడ ఉంటుంది. మంత్రులు, అధికారులుగా మీకు ప్రజలకు మేలు చేసే మంచి అవకాశం లభించింది. అనుకున్న లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో పని చేద్దాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.