- ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి
- ప్రతి ఓటరుని కలిసి ఓటు వేయించాలి
- సీటు త్యాగం చేసిన ఆలపాటికి ఎమ్మెల్సీని బహుమతిగా ఇద్దాం
- ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలతో సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (చైతన్యరథం): సాధారణ ఎన్నికల సమయంలో అధినేత చంద్రబాబు మాటకు గౌరవమిచ్చి సీటు త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కి ఎమ్మెల్సీ సీటును బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇంఛార్జిలు, కార్యకర్తలతో నిర్వహించిన సోమవారంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికలకు ఓట్లు ఎక్కడున్నాయో స్పష్టంగా తెలుస్తాయి, కానీ గ్రాడ్యుయేట్ ఓట్లను మనమే వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంటుందన్నారు. గత ఎన్నికలకు ముందు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు మనం గెలుచుకున్నందునే.. సాధారణ ఎన్నికలు మనకు సులువయ్యాయన్నారు. ఇంతటి భారీ విజయాన్ని అందించి పెట్టాయి. అదే విధంగా ఇప్పుడు జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.
తద్వారా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు సులువుగా గెలుచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో దాదాపు 10 వేల ఓట్లున్నాయి. క్లస్టర్ ఇంఛార్జిలు, డివిజన్ ఇంఛార్జిలు ప్రతి ఓటరుని కూడా ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా కలిసి ఓటు వేసే విధంగా చూసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అదే మనం ఇచ్చే గౌరవం అన్నారు. ఎన్నికల్లో గెలిచే వరకు ప్రతి కార్యకర్తా, నాయకుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.