- భక్తులకు ఇబ్బంది లేకుండా శ్రీశైలంలో పకడ్బందీ ఏర్పాట్లు
- ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం
- 23న సీఎం పట్టువస్త్రాల సమర్పణ
- దేవాదాయ మంత్రి ఆనం వెల్లడి
- ఏర్పాట్లపై మంత్రులు ఆనం, అనిత, అనగాని, జనార్దన్ రెడ్డి సమీక్ష
శ్రీశైలం (చైతన్యరథం): శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై రాష్ట్ర మంత్రులు సోమవారం కీలక సమీక్ష నిర్వహించారు. మల్లన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ.. శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించనున్నామన్నారు. 23వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. శ్రీశైల భ్రమరాంబిక సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వార్లకు ప్రభుత్వం తరుఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. 25, 26 తేదీలలో రెండు రోజుల పాటు శ్రీశైలం టోల్‌గేట్ల వద్ద భక్తుల వాహనాలకు ఎటువంటి రుసుం లేకుండా ఉచితంగా అనుమతిస్తామన్నారు.
శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని.. శ్రీశైలంలో స్వామి వారిని దర్శించుకొనేందుకు.. నల్లమల అటవీ మార్గంలో వచ్చే భక్తులకు గిరిజన గ్రామాల్లో మంచి నీరు, ఆహారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తామన్నారు. అయితే గత సంవత్సరం కంటే ఈ ఏడాది 30 శాతం మంది భక్తులు అధికంగా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అలాగే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా స్వామి వారి దర్శనానంతరం భక్తులు సత్రాలకు వెళ్లేందుకు, పార్కింగ్ నుంచి సత్రాల వద్దకు వాహనాల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామన్నారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రధానమైన నాలుగు రోజులు.. భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్వామి, అమ్మవార్ల దర్శనాలకు సామాన్య భక్తులకు అధిక సమయం కేటాయించి.. వీఐపీ దర్శన సమయాన్ని అవసరమైతే అర్ధగంట పాటు తగ్గించాలని ఇప్పటికే అధికారులకు సూచించామన్నారు.
ఇక భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. మరోవైపు శివదీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తుల భద్రతలో భాగంగా అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని.. అలాగే డ్రోన్ కెమెరాల ద్వారా భక్తుల రాకపోకలు పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. రోప్ పార్టీలను ఏర్పాటు చేసి.. భక్తులను క్యూలైన్లలోకి పంపిస్తామని.. ఎక్కడా తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.