- సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రులు, కార్యదర్శులతో కీలక సమావేశం
- రెండు సెషన్లుగా సమావేశం
- కీలక అంశాలపై చర్చ
- ఆయా శాఖల తరఫున ప్రజెంటేషన్లు పంపాలని కార్యదర్శులకు సీఎస్ ఆదేశం
- కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి జరిగే మేలు, స్వర్ణాంధ్ర`2047పైనా చర్చ
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశాల్లో ఆ మేరకు మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పాలనలో వేగం అందుకోవాలని అధికారులకు మార్గదర్శకాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 11న సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వశాఖల కార్యదర్శులతో కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా జరిగే ఈ సమావేశంలో మంత్రులు, కార్యదర్శులతో పాలనాపరమైన అంశాలపై చర్చిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాధించిన విజయాలు, ఈ ఏడాది మార్చి వరకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక, మ్యానిఫెస్టోలోని హామీల అమలు, కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, స్వర్ణాంధ్ర `2047పై అంశాలపై కూడా చర్చ ఉంటుంది.
గత కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, హెచ్‌వోడీ నుంచి మండల కార్యాలయాల వరకు ఆన్‌లైన్‌లో దస్త్రాల పరిశీలనపై ఈ సమావేశంలో చర్చిస్తారు. తొలి సెషన్లో ఫైళ్ల క్లియరెన్స్, జీఎస్‌డీపీపై చర్చిస్తారు. వాట్సాప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగిపై కూడా చర్చించనున్నారు. త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌పై రెండో సెషన్లో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఆయా శాఖల తరఫున ప్రజెంటేషన్లు పంపాలని కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం లోగా రెండు ప్రజెంటేషన్లు పంపాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజెంటేషన్లు ఉండాలని స్పష్టం చేశారు. ఒక్కో ప్రజెంటేషన్ నిడివి 15 నిమిషాలు ఉండాలని ఆదేశాల్లో సీఎస్ పేర్కొన్నారు.
పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టే వేళ..
అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 24న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అప్పుల్లో కూరుకు పోయిన రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే ఆర్థికశాఖ పూర్తి కసరత్తు చేసింది. సమావేశంలో పలు శాఖలపై కార్యదర్శులకు కూడా సీఎం చంద్రబాబు స్పష్టత ఇవ్వనున్నారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ ఈ సమావేశం కీలకం కానుంది. గత కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. టీం వర్క్‌తో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని మంత్రులకు ఎప్పటికప్పుడు చెబుతున్నారు. ఇందుకోసం అసాధారణ పని తీరును చూపించాలని సూచిస్తున్నారు. వచ్చే మూడు నెలలు కీలక పథకాలను అమలు చేస్తామని, వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని కూడా ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన 11న జరిగే సమావేశంలో మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు.