- కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్ కృతజ్ఞతలు
- అక్కడే.. దేవగౌడ ఆశీస్సులు తీసుకున్న విద్యా మంత్రి
న్యూఢిల్లీ (చైతన్య రథం): కేంద్ర భారీపరిశ్రమల మంత్రి హెచ్‌డి కుమారస్వామిని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అక్కడేవున్న మాజీ ప్రధాని దేవగౌడను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పునరుజ్జీవనానికి సుమారు రూ.12వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినందుకు కుమారస్వామికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజల సెంటిమెంట్‌తోపాటు వేలాదిమంది కార్మికుల ఆందోళన, మనోభావాలను అర్థం చేసుకుని పెద్దమనసుతో సహకారం అందించారని కొనియాడారు. స్టీల్ ప్లాంట్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడం, ఉత్పాదకత పెంపునకు చర్యలు చేపట్టడం, కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకోవడంలో మంత్రి చొరవ శ్లాఘనీయమన్నారు. అనకాపల్లి వద్ద ప్రైవేటురంగంలో ఏర్పాటుకానున్న ఆర్సెలర్స్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ ఉక్కు పరిశ్రమవల్ల ఏపీ యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం తరపున అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు.