అమరావతి (చైతన్యరథం): కేంద్ర ప్రభ్వు బడ్జెట్ కేటాయింపులు అన్ని వర్గాలవారికి మేలుచేర్చేలా ఉనాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రత్యేకించి మధ్య తరగతి వారికి ఆదాయ పన్ను వెసులుబాటు ఊరట కలిగిస్తుందన్నారు. 12 లక్షల రూపాయల వరకు మినహాయింపులు ఇవ్వడం హర్షణీయం. రైతులకు కిసాన్ క్రెడిట్ పరిమితిని 3 నుంచి 5 లక్షలకు పెంచడం, ఎంఎస్‌ఎంఈ లకు వరాలు ప్రకటించడంతో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు చేయూతనిచ్చి రుణాల బాధ నుంచి తప్పించినట్టయింది. పోలవరం, విశాఖ ఉక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామం. గత ప్రభుత్వం అటకెక్కించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 5,936 కోట్లు, బ్యాలెన్స్ గ్రాంట్ గా 12,157 కోట్లు, స్టీల్ ప్లాంటుకు 3295 కోట్ల కేటాయింపులతో ఇక పరుగులు పెట్టడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలను ప్రతిబింబించేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయనిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు వీటిద్వారా మరింత ఊతం లభిస్తుంది. కేంద్ర బడ్జెట్ ప్రజారంజకంగా ఉన్నందున ప్రజలకు మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరింత త్వరగా పూర్తి చేస్తామన్న గట్టి నమ్మకం కలిగిందని మంత్రి పార్థసారథి అన్నారు.