- కర్నూలు స్టేడియంను ఆభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దుతాం
- ఎంపీ నాగరాజు, శాప్ ఛైర్మన్ రవినాయుడు ఉద్ఘాటన
- డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీని సందర్శించిన ఎంపీ, శాప్ ఛైర్మన్
- డీఎస్‌ఏ నిర్వహణ పట్ల శాప్ ఛైర్మన్ అసంతృప్తి
- డీఎస్డీఓ పనితీరుపై ఆగ్రహం, పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక
కర్నూలు (చైతన్యరథం): వెనుకబడిన కర్నూలు జిల్లాలో మెరుగైన క్రీడావసతులు ఏర్పాటు చేయడంతోపాటు, జిల్లాను క్రీడాకేంద్రంగా తీర్చిదిద్దుతామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడులు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు పార్లమెంటు సభ్యుడు నాగరాజుతో కలిసి కర్నూలు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్‌ఏ) స్టేడియంను శాప్ ఛైర్మన్ రవినాయుడు శనివారం సందర్శించారు. తొలుత డీఎస్‌ఏ ముఖద్వారం వద్ద ఉన్న హాకీ క్రీడాకారుడు పద్మశ్రీ ధ్యాన్‌చంద్ విగ్రహానికి వారిరువురూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్‌ఏలోని అవుట్‌డోర్ స్టేడియంతోపాటు జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్ ఇండోర్ హాలును సంయుక్తంగా పరిశీలించారు. డీఎస్‌ఏలో విధుల నిర్వహణ, అభివృద్ధి పనుల పురోగతి, పారిశుద్ధ్య నిర్వహణ, క్రీడావసతుల కల్పనపై అధికారులతో శాప్ ఛైర్మన్ ఆరా తీశారు. అస్తవ్యస్థంగా ఉన్న డీఎస్‌ఏ నిర్వహణ పట్ల శాప్ ఛైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండోర్ స్టేడియంలో టాయిలెట్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, పారిశుద్ధ్య నిర్వహణ పడకేసిందని అసహనం వ్యక్తం చేశారు. అలసత్వంగా వ్యవహరిస్తున్న కర్నూలు డీఎస్డీవో బీ భూపతిరావు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తొలుత ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో క్రీడారంగం నిర్వీర్యమైందన్నారు. క్రీడలను పట్టించుకోకపోవడంతో ఈ ఐదేళ్లలో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వెనుకబడిన కర్నూలు జిల్లాలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కర్నూలు డీఎస్‌ఏ ఆధ్వర్యంలోని స్టేడియాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్టేడియం అభివృద్ధికి శాప్ సహకరించాలని, కర్నూలులో క్రీడాభివృద్ధికి ఎంపీగా తన శాయశక్తులా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి తీసుకురావాల్సిన క్రీడానిధులను సమకూర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. సమర్థవంతమైన వ్యక్తికి శాప్ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించడం ఏపీ క్రీడాకారులకు వరమని, ఎవరూ పట్టించుకోని కర్నూలు స్టేడియంపై దృష్టి పెట్టడం శాప్ ఛైర్మన్ రవినాయుడికి క్రీడల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
కర్నూలు స్టేడియం అభివృద్ధి: రవినాయుడు
కర్నూలులో అత్యుత్తమ క్రీడావసతులను ఏర్పాటు చేసి కర్నూలు స్టేడియాన్ని అభివృద్ధికి మోడల్‌గా తీర్చిదిద్దుతామని శాప్ ఛైర్మన్ రవినాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ క్రీడాపోటీలు జరిగినా అక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి క్రీడాకారులు ఉంటారన్నారు. కానీ క్రీడలకు పేరుగాంచిన కర్నూలులో క్రీడాకారులకు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కర్నూలులో క్రీడల అభివృద్ధిపై మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, వారిరువురి సహకారంతో కర్నూలు స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామని శాప్ ఛైర్మన్ హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో స్టేడియంల నిర్మాణాలకు జోహారపురం, వాటర్‌ఫాల్స్ వద్ద రెండు స్థలాలను గుర్తించామని, వాటికి సంబంధించి ప్రతిపాదనలు తయారుచేసి త్వరలోనే ఎంపీ, మంత్రుల సాయంతో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ అత్యుత్తమ క్రీడావసతులతో కేవీకేలు, మల్టీపర్పస్ స్టేడియాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం క్రీడారంగాన్ని రాజకీయక్రీడగా మార్చిందని, ఆడుదాం ఆంధ్రా పేరుతో రూ.119 కోట్లను వైసీపీ నాయకులు కొల్లగొట్టారన్నారు. క్రీడాకారుల భవిష్యత్తే ప్రభుత్వానికి ముఖ్యమని, కర్నూలు క్రీడాకారులకు మెరుగైన క్రీడాసదుపాయాలు కల్పించడమే లక్ష్యమన్నారు. కర్నూలు డీఎస్‌ఏ అభివృద్ధికి నిర్ధిష్టమైన ప్రణాళికలతో డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ లక్ష్యమని దుయ్యబట్టారు. దమ్ముంటే ఫీజు రీయింబర్స్‌మెంటుపై జగన్ ఇంటి ఎదుట ధర్నా చేయాలని విమర్శించారు. విద్యార్థుల గొంతుకోసింది జగన్‌రెడ్డి కాదా, చివరి 4 విడతలు బకాయిలు పెట్టింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి ముందు పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘాల నిర్వాహకులు, యువజన సంఘాల నాయకులు శాప్ ఛైర్మన్‌ను ఘనంగా సత్కరించారు. అలాగే పలువురు క్రీడాకారుల నుంచి శాప్ ఛైర్మన్ వినతులు స్వీకరించారు.
క్రీడల అభివృద్ధికి సహకరించాలి
` మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌కి శాప్ ఛైర్మన్ వినతి
రాయలసీమ అభివృద్ధిలో ప్రధానభూమిక పోషించిన విధంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్రీడల అభివృద్ధికి సహకరించాలని ప్రముఖ వ్యాపారవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్‌ను శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు కోరారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు విచ్చేసిన రవినాయుడు.. వెంకటేష్‌ను కర్నూలులోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిరువురూ ఏపీలో క్రీడలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. తొలుత కర్నూలు జిల్లాలో క్రీడల అభివృద్ధి చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు టీజీ వెంకటేష్‌కు వివరిస్తూ రవినాయుడు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఏదోఒక క్రీడను దత్తత తీసుకుని ఆ క్రీడలో రాణిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించాలని వెంకటేష్‌ను కోరారు. అలాగే సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలకు అనుగుణంగా క్రీడల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులను సమకూర్చేందుకు సహకరించాలని, గతంలో సొంత నిధులను వెచ్చించి క్రీడాపోటీలు నిర్వహించిన విధంగానే ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడల అభివృద్ధికి సాయపడాలని విన్నవించారు. గతంలో క్రీడాకారులను ప్రోత్సహించటంలో వెంకటేష్ ముందువరుసలో ఉన్నారని గుర్తు చేశారు. క్రీడల ప్రోత్సహానికి మీలాంటి వారి అవసరం ఉందని ఆకాంక్షించారు. మీరు ముందుకొస్తే క్రీడలకు పూర్వవైభవం చేకూరుతుందని రవినాయుడు కోరారు. దీనిపై వెంకటేష్ సానుకూలంగా స్పందించి క్రీడారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వానికి, స్పోర్ట్స్ అథారిటీకి సహకరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.