- గోదావరి- బనకచర్లతో సీమలో ప్రతి ఎకరాకూ సాగుజలాలు
- సీమలో ఎన్టీఆర్ ప్రాజెక్టులు ప్రారంభిస్తే నేను ముందుకు తీసుకెళ్లా
- గత ప్రభుత్వంలో సాగునీటి రంగం నిర్వీర్యం..
- త్వరలోనే శ్రీనివాసపురం కెనాల్‌కు టెండర్లు పిలుస్తాం
- పెన్షన్ల పెంపుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపాం
- 2047నాటికి పేదరికంలేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతా
- చెప్పిన దానికి మించి పనులు చేసి రుణం తీర్చుకుంటాను
- రాష్ట్రానికి 7 నెలల్లో రూ.7లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
- వైసీపీ వదిలేసిన రూ.22,252 కోట్ల బకాయిలు చెల్లించాం
- గత పాలకులు రాష్ట్రాన్ని దోచుకుని నాశనం చేశారు..
- సంబేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన
- ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- వివిధ వర్గాల ప్రజలు, ఐటీ ఉద్యోగులతో సీఎం ముఖాముఖి
రాయచోటి (చైతన్య రథం): ‘కేంద్ర ప్రభుత్వ సహకారంతో గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు పూర్తిచేసి రాయలసీమలో ప్రతి ఎకరాకూ నీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాయలసీమలో వాణిజ్య పంటలకు ప్రోత్సాహకాలు అందిస్తామంటూ, 2019లో అధికారంలోకి వచ్చి ఉండుంటే 2020 నాటికే హంద్రినీవా నీరు ఈ ప్రాంతానికి అందించి ఉండేవాడనని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కపైసా ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేసిందని విచారం వ్యక్తం చేశారు. ‘తంబళ్లపల్లి నుంచి శ్రీనవాసపురానికి ఒక కెనాల్ వస్తుంది. వీలైనంత తొందరలో టెండర్లు పిలిచి ప్రాజెక్టు పూర్తి చేస్తా’మని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం మోటకట్లలో ఎన్టీఆర్ భరోసా పింఛను కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారుల నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు వారికి స్వయంగా పెన్షన్ అందించారు. అంతకముందు సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మోటకట్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెన్షన్‌దారులు, ఐటీ ఉద్యోగులు, వివిధవర్గాల ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.
పేదరికంలేని రాష్ట్రమే లక్ష్యం
2047నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఐదేళ్ల విధ్వంస పాలనతో రాష్ట్రం సర్వనాశనమైందని, నాటి పాలకులు రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకు తిన్నారని దుయ్యబట్టారు. రూ. 10 లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టిపోయారన్నారు. వ్యవస్థలను గాడిలో పెడుతూ… కేవలం ఏడు నెలల్లో రూ.ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, రూ.22,252 కోట్ల గత ప్రభుత్వ బకాయిలు చెల్లించామని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. ‘నాలెడ్జ్ పెంచుకుని కష్టపడి పనిచేస్తే ఆకాశమే హద్దుగా ఎదగవచ్చు. నా మాట నమ్మినవాళ్లు బాగుపడ్డారు. ఏపీని వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్‌గా మారుస్తాం. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇంటినుంచి పనిచేసే విధానాన్ని ఒక నినాదంగా ప్రచారం చేశాను. కో వర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రమ్ హోమ్‌తో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుంది. భవిష్యత్‌లో గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉన్నవారికి శిక్షణ అందించి అవకాశాలు కల్పించేందుకు స్పేస్ క్రియేట్ చేస్తాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలు పెడుతున్నాం. ఐదు ప్రాంతాల్లో టాటా ఇన్నొవేషన్ హబ్స్ రాబోతున్నాయి. మీ ఊళ్లోనే కూర్చుని పనిచేయవచ్చు. వీటితోపాటు వ్యవసాయ ఆధారిత పనులు చేసుకుంటూ అదనంగా సంపాదించవచ్చు’ అని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు.
నాడు ఐటీ… నేడు ఏఐకి ప్రాధాన్యం
ఒకప్పుడు తాను ఐటీని ప్రమోట్ చేశానని, అప్పటికి ఎవరికీ ఐటీపై అవగాహన లేదని సీఎం చంద్రబాబు గతాన్ని గుర్తు చేశారు. అలాంటిది బిల్‌గేట్స్ ఇంటర్నెట్ తీసుకొచ్చాక ప్రపంచమంతా కుగ్రామంగా మారిందని, ఇంటర్నెట్ వచ్చాక టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ఆనాడు ఫైల్స్ మోసుకెళ్లి అమెరికాలో ప్రముఖ కంపెనీల చుట్టూ తిరిగానని, హైటెక్ సిటీ కట్టేందుకు చాలా శ్రమించానని, ఎన్నో సమావేశాలు నిర్వహించామన్నారు. హైటెక్ సిటీ చూశాక యువతకు బాగా చదువుకోవాలని ఆశ పుట్టింది. తొమ్మిదేళ్లలో 300 ఇంజినీరింగ్ కాలేజీలు తెచ్చాను. ఆ కాలేజీలను చూసి యువత చదువుకున్నారు. ప్రపంచమంతా మన తెలుగువాళ్లు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. నేడు అమెరికన్స్ తలసరి ఆదాయం 60 వేల డాలర్లుంటే, అక్కడి మన తెలుగు వారి తలసరి ఆదాయం లక్షా 20 వేల డాలర్లుగా ఉంది. నన్ను అరెస్ట్ చేసినప్పుడు 80 దేశాల్లో తెలుగువారు 53 రోజులు ప్రదర్శన చేశారు. 100 దేశాల్లో మన తెలుగు వారుండటం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం
‘వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందని సీపం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలవరానికి రూ12 వేల కోట్లు మంజూరు చేశారని, అమరావతి, విశాఖ, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులకు నిధులు కేటాయించారన్నారు. 2027నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాను. ఇప్పుడు అమరావతిని నిర్మిస్తున్నాను. నన్ను నమ్మి 35 వేల ఎకరాలను రైతులు ఒక్క పైసా తీసుకోకుండా ఇచ్చారు. నేను గాలిలో మాటలు చెప్పడం లేదు. చేసిన పనుల ఫలితాలు మీరు చూశారు. అమరావతి దేవతల రాజధాని. దేవేంద్రుడు పాలించిన రాజధాని పేరు అమరావతి. రాజధానికి నేను శ్రీకారం చుడితే మూడు ముక్కలాట ఆడారు. స్మశానమని దిగజారి మాట్లాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెన్షన్లతో పేదల జీవితాల్లో వెలుగులు నింపాం
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి దగా జరిగింది. అడవిపందుల్లా దోచుకున్నారు. తిన్నంత తిని నాశనం చేశారు. రూ.10 లక్షల కోట్లు అప్పుచేసి పోయారు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కాపాడతానని నాపై ప్రజలు నమ్మకం పెట్టుకుని గెలిపించారు. పెన్షన్లతో పేదలకు భద్రత వచ్చింది. వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. ప్రతి నెలా 64 లక్షలమందికి పెన్షన్ అందిస్తున్నాం. ఇందుకోసం ఏడాదికి రూ. 32,520 కోట్లు వ్యయం చేస్తున్నాము. దేశంలో ఏ రాష్ట్రమూ ఇంత ఖర్చు చేయడం లేదు. తెలంగాణ రూ.8 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.5,400 కోట్లు, కర్ణాటక రూ.4,700 కోట్లు, తమిళనాడు రూ.3,780 కోట్లు, గుజరాత్ రూ.1,384 కోట్లు పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు …. ఇలా 28 రకాల వ్యక్తులకు పెన్షన్ అందిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.
లోకేష్ ఆలోచనల నుంచే వాట్సాప్ గవర్నెన్స్
‘యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ ఆలోచనలు నుంచి వచ్చిందే వాట్సాప్ గవర్నెన్స్. దీని ద్వారా పౌరులకు 161 ప్రభుత్వ సేవలు అందిస్తున్నాము. ఏడు నెలల్లో చెప్పిన దానికంటే ఎక్కువ పనులు చేసి ప్రజల రుణం తీర్చుకుంటాను. అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాం. నా తల్లి కష్టం ఏ ఆడబిడ్డకూ రాకూడదని దీపం పథకం పెట్టి దేశంలోనే మొదటిసారి గ్యాస్ అందించాము. ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము. త్వరలో ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తాం. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద రూ.20 వేలు అందిస్తాము. రూ.6 కోట్లతో ఈ జిల్లాలో గుంతలు లేని రోడ్లు వేశామంటే మీరు ఎంచుకున్న ప్రభుత్వం ఏంచేసిందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. చెప్పిన దానికంటే ఎక్కువ పనులు చేసి ప్రజల రుణం తీర్చుకుంటాను. పెద్దఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. వీటివల్ల 4 లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఐదేళ్లలో 20 లక్షలమందికి ఉద్యోగాలిస్తాము’ అని సీఎం స్పష్టం చేశారు.
సీమ సస్యశ్యామలానికి ఎన్టీఆర్ కారణం
ఓవైపు ఐటీ మరోవైపు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘రాయలసీమ నేడు ఇలా అయినా ఉందంటే ఎన్టీఆర్ కారణం. రాయలసీమలో ప్రాజెక్టులు ప్రారంభించింది ఎన్టీఆర్ అయితే నేను వాటిని ముందుకు తీసుకెళ్లా. 2014-2019 మధ్య నీటి పారుదల ప్రాజెక్టుల కోసం రూ.64 వేల కోట్ల వ్యయం చేశాము. గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేసింది. విధ్వంస పాలనపై ప్రశ్నిస్తే నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. మళ్లీ డయాఫ్రం వాల్ నిర్మించాల్సిన పరిస్థితి తెచ్చారు. మీకు కులాలు, ప్రాంతాలు, మతాలు వద్దు. ఎవరు మనకు న్యాయం చేశారు, ముందు చూపుతో ఆలోచించారు, ఎవరివల్ల బాగుపడ్డామో మీరు ఆలోచించగలిగారంటే ఎప్పటికీ ఈ ప్రభుత్వానికే ఓటేస్తారని సీఎం చంద్రబాబు అన్నారు.