- సంస్థాగత మార్పులపై అధ్యయనం
- క్రీడావసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు వెల్లడి
నంద్యాల (చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని, అందులో భాగంగానే దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ స్పోర్ట్స్ పాలసీని రూపొందించామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు స్పష్టం చేశారు. నంద్యాలలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్‌ఏ) స్టేడియం, ఇండోర్ స్టేడియాలను తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎమ్‌డి ఫిరోజ్‌తో కలిసి శాప్ ఛైర్మన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా స్టేడియాలను పరిశీలించి జిల్లాలోని క్రీడల అభివృద్ధిపై డీఎస్డీఓ ఎన్‌వి రాజు, డీఎస్‌ఏ సిబ్బంది, కోచ్‌లతో చర్చించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ మైనారిటీ వెల్ఫేర్ మంత్రి ఎన్‌ఎమ్‌డి ఫరూక్ సూచనల మేరకు నంద్యాల జిల్లాలో క్రీడల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. దానిలో భాగంగానే నంద్యాల డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం, ఇండోర్ స్టేడియాల్లోని కోర్టులు పరిశీలించామన్నారు. క్రీడారంగంలో సంస్థాగత మార్పులు, క్రీడల అభివృద్ధిపై పర్యవేక్షణ కోసమే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నామన్నారు. క్రీడావసతుల లేమితో ఉమ్మడి కర్నూలు జిల్లా క్రీడాకారులు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారని, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. నంద్యాల డీఎస్‌ఏ స్టేడియం అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలతో డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామన్నారు. గతంలో నంద్యాలలో స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, అలాగే మైదానం నిర్వహణకు సైతం ఇబ్బంది లేకుండా షాపులు నిర్మించి ఆదాయ వనరులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించిందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయన్నారు. జిల్లాలో క్రీడలు, క్రీడాకారుల దత్తతకు పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికుల సహకారం అవసరమన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా క్రీడలు నిర్వీర్యమైపోయాయని, 26 జిల్లాల పర్యటనల్లోనూ 21 జిల్లాలో ఇదే దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేయడమే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమన్నారు. స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో విద్యాశాఖమంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. అర్బన్ ప్రాంతాల్లో అకాడమీలు, ప్రతీ నియోజకవర్గంలోనూ క్రీడావికాస కేంద్రాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు.