- 374 మంది గిరిజనులకు భూ హక్కు పట్టాలు పంపిణీ
- సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించే ఎస్టీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన
- మేదరమెట్లలో రూ.40 లక్షలతో నిర్మించిన రోడ్లు ప్రారంభం
- గుండ్లకమ్మలో 6 లక్షల చేప పిల్లలు వదులుతామని వెల్లడి
- వైసీపీ ఐదేళ్ల పాలనలో అంతా అస్తవ్యస్తం
- ఏడు నెలల్లో ఎంతో అభివృద్ధి చేశాం
అద్దంకి (చైతన్యరథం): పట్టణాలకు దీటుగా గ్రామాలనూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మేదరమెట్ల గ్రామంలో గత 20 ఏళ్లుగా ఎటువంటి హక్కులూ లేకుండా జీవిస్తున్న 374 గిరిజన కుటుంబాలకు భూ హక్కు పట్టాలను శుక్రవారం మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు. అదే విధంగా రూ.40 లక్షలతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న సీసీ రోడ్లను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. మరో రూ.40 లక్షల నిధులతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. దీనితో పాటు మేదరమెట్ల ఎస్టీ కాలనీలో సింథైడ్ ఫ్యాక్టరీ సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడంతో పాటు తాగునీటి సమస్యనూ తీర్చుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల కాలంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశామని చెప్పారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి అభివృద్ధిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఎస్టీ కాలనీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మేదరమెట్ల ఎస్టీ కాలనీలో ఇప్పటికే 180 కొత్త కరెంటు స్తంభాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎస్టీ కాలనీలోని అన్ని కుటుంబాలకూ విద్యుత్ అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
గ్రామాల్లోనూ సీసీ కెమెరాల రక్షణ…
మేదరమెట్ల గ్రామంలోనూ త్వరలోనే 30 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడిరచారు. అదే విధంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను విరగొట్టిన గత వైసీపీ ప్రభుత్వ నాయకులు.. ఇసుక దోపిడీ చేశారని విమర్శించారు. గుండ్లకమ్మ గేట్లను బాగు చేయించి… అందులో సుమారు 6 లక్షల చేప పిల్లలను వదులుతున్నామన్నారు. గుండ్లకమ్మను నాశనం చేయడంతో చేపల వేట ఆధారంగా జీవించే కొన్ని కుటుంబాలు… గత ఐదేళ్లుగా ఈ ప్రాంతాన్ని విడిచి వలస పోవడం తనను బాధకు గురి చేసిందని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సంక్షేమ పెన్షన్లను పెంచడంతో పాటు పూర్తి స్థాయి వికలాంగులకు నెలకు రూ.15,000 పెన్షన్ ఇస్తున్నామన్నారు. అద్దంకి టౌన్‌లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అదే విధంగా సుమారు రూ.1.80 లక్షలతో రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో బాగు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసిన పలువురు గ్రామస్థులు తమ సమస్యలను విన్నవించుకోగా… మంత్రి సానుకూలంగా స్పందించారు. మేదరమెట్ల గ్రామస్థులు తనకు రికార్డ్ స్థాయి మెజారిటీ ఇచ్చారని… ఎన్నడూ దానిని మరచిపోలేనని మంత్రి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అదే విధంగా గత ఏడు నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని కూడా ప్రజలందరూ గమనించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రెవిన్యూ, విద్యుత్ శాఖలతో పాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.