- ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు
- నూతన డీజీపీ హరీష్ గుప్తా
అమరావతి (చైతన్యరథం): సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టడం వ్యవస్థీకృత నేరంగా మారిందని.. అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి తన ఛాంబర్ లోకి ప్రవేశించిన ఆయన, లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. తనకు డీజీపీగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నిర్దేశించిన స్వర్ణాంధ్ర లక్ష్యం నెరవేర్చడంలో పోలీసు శాఖ తన వంతు బాధ్యత నిర్వహిస్తుందన్నారు.
గత ఏడు నెలల్లో పోలీసు శాఖలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు.. వాటి వినియోగంపై దృష్టి పెడతామన్నారు. సీసీటీఎన్‌ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్)కు అనుసంధానం చేసి.. ఫేస్ రికగ్నిషన్ పరిజ్ఞానం ద్వారా నిందితులను త్వరగా గుర్తించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ విధులను నిర్వర్తిస్తామన్నారు. పోలీసులకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టి వారి సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటే మెరుగైన సేవలందించగలుగుతారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆయన పదవీకాలం శక్రవారంతో ముగిసింది.