అమరావతి (చైతన్యరథం): యువగళం పాదయాత్ర సమయంలో సాక్షి పత్రిక, వైసీపీ సోషల్ మీడియాలో తనపై చేసిన దుష్ప్రచారంపై దాఖలు చేసిన పరువునష్టం కేసుల్లో ఈ నెల 31వ తేదీ శుక్రవారం ఉదయం 10.00 గంటలకు మంగళగిరి కోర్టుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. తాను అనని మాటలను అన్నట్లుగా మార్ఫింగ్ వీడియో, తప్పుడు రాతలతో ప్రజలను పక్కదారి పట్టించిన వైసీపీ సోషల్ మీడియా, సాక్షి పత్రికపై మంత్రి నారా లోకేష్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. యువగళం పాదయాత్ర కొనసాగే సమయంలో కర్నూలు జిల్లా జక్కసానిపల్లిలో 2023, ఏప్రిల్ 13వ తేదీన నారా లోకేష్ దళితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దళితులను కించపరిచేలా మాట్లాడినట్లుగా సాక్షి దినపత్రికలో తప్పుడు వార్తను ప్రచురించారు. అదే అంశంపై వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ నుంచి మార్ఫింగ్ వీడియోలను కూడా పెట్టారు. తనపై చేసిన దుష్ప్రచారంపై జగతి పబ్లికేషన్స్, అప్పటి వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై నారా లోకేష్ పరువునష్టం, క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించి మంత్రి నారా లోకేష్ శుక్రవారం మంగళగిరి ఫస్ట్ క్లాస్ అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ కేసుల్లో మంత్రి నారా లోకేష్ తరపున సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు హాజరవుతున్నారు.