- ఈ గ్రామాల్లోని 12,149 ఇళ్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం
- 610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచల దేవస్థానానికి ఇచ్చేందుకు సంసిద్ధం
- సీఎం అధ్య్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు
- రెవిన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి
అమరావతి, (చైతన్యరథం) : ఎంతో కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు త్వరలో ప్రభుత్వం పరిష్కారం చూపనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెవిన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ సమస్యకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు జరిగాయన్నారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో విశాఖపట్నానికి చెందిన పలువురు శాసన సభ్యులతో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. పంచ గ్రామాల్లోని 12,149 ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రత్యామ్నయంగా దాదాపు రూ.5,300 కోట్ల విలువ చేసే 610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచల దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సింహచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కూడా ఆమోదం తెలిపారన్నారు. ఈ సమస్యకు సంబంధించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై పలువురు కోర్టుకు వెళ్ళారన్నారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఆ కేసులను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీరించేందుకు జీ.ఓ.నెం. 338, 296 ఉత్తర్వులను జారీ చేశామన్నారు. ఈ జీవోల కింద విశాఖలో 70 వేల మంది క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు.
ఈ జీఓల ప్రకారం రెండేళ్ల కాల వ్యవధిలో ఆ భూములపై లబ్ధిదారులకు అన్ని హక్కులు సంప్రాప్తం అయ్యే విధంగా కన్వేయన్సు డీడ్ కూడా ఇవ్వాలని నిర్ణయం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం ఆ ఓలను పట్టించుకోకుండా లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా స్పందించ లేదన్నారు. తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక శాసన సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేసిన విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. దానికనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత జీఓ ప్రకారం ఈ భూములను క్రమబద్ధీకరించాలని, అప్పటి నుండి రెండేళ్ల కాలవ్యవధి పూర్తి అయిన వాటికి కన్వేయన్సు డీడ్లును కూడా జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అదే విధంగా రైతులు సాగు చేసుకునే భూములు, కొన్ని ఖాళీ స్థలాలకు సంబంధించి కోర్టులో పలు కేసులు ఉన్నందున, వాటిని కూడా పరిష్కరించరించేందుకు దశల వారీగా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్(యుఎల్‌సీ)లోని అదనపు భూముల్లో ఆక్రమణకు గురైన వాటిని పీఓటీ చట్టం ప్రకారం పదేళ్ల కాల వ్యవధిలో కేటాయింపు చేయాల్సి ఉందని, అయితే అటు వంటి భూములకు కూడా రెండేళ్ల కాలవ్యవధిలోనే కన్వేయన్సు డీడ్లును ఇచ్చేందుకు ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడిరచారు. గాజువాక ఈనాం భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి తమ ప్రభుత్వం 2018లో జారీ చేసిన 301 జీఓ ప్రకారం దాదాపు 7 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ ప్రక్రియ కూడా పూర్తి కాకుండా అపరిష్కృతంగా ఉందన్నారు. ఈ జీఓను కూడా సవరించి నూతన మార్గదర్శకాలతో మరో జీఓ జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడిరచారు.
ఈనాం భూముల క్రమబద్ధీకరణ
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సింహాచలం దేవస్థానం భూమి సుమారు 420 ఎకరాలు ఆక్రమణకు గురై వాటిలో దాదాపు 12,149 ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఆ ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు గతంలో తమ ప్రభుత్వం 229 జీఓ జారీ చేసిందన్నారు. 420 ఎకరాల ప్రభుత్వ భూమిని మరో చోట ఇచ్చేందుకు, క్రమబద్ధీకరణ కింద వచ్చే ఫీజును కూడా దేవస్థానానికి ఇచ్చేందుకు నిర్ణయం జరిగిందన్నారు. అయితే ఆక్రమణకు గురైన దేవస్థానం భూమి విలువకు తగిన భూమిని ఇవ్వాలని కోరుతూ కొంత మంది కోర్టుకు వెళ్ళారన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం మేరకు 420 ఎకరాలకు బదులుగా 610 ఎకరాలు (సమాన రిజిస్ట్రేషన్ విలువతో) సింహాచలం దేవస్థానానికి బదలాయించాలని నిర్ణయం జరిగిందన్నారు. దీని రిజిస్ట్రేషన్ విలువ దాదాపు రూ.5,300 కోట్ల వరకూ ఉందన్నారు. పెదగంట్యాడ, గాజువాక, గొల్లలపాలెం తదితర ప్రాంతాల్లో సింహాచలం దేవస్థానానికి 610 ఎకరాల భూమి ఇస్తున్నామన్నారు. దేవస్థానానికి అవసరమైన చందనం చెట్లను పెంచుకునేందుకు అవకాశం ఉన్న చోట భూమి ఇస్తున్నామన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కోర్టులో కౌంటరు ఫైల్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రెండు మూడు మాసాల్లో ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. గాజువాకలో ఈనాం భూమిని క్రమబద్ధీకరించేందుకు కూడా నిర్ణయం ఓజరిగిందన్నారు. ఈ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి 2015-16 సంవత్సరంలో 301 జీఓ జారీ అయ్యిందన్నారు. దాని గడువు ముగిసిందన్నారు.దానిని పొడిగిస్తూ మరో జీఓ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనివల్ల మరో ఆరు వేల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
సమావేశంలో విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు (గణబాబు) మాట్లాడుతూ సింహాచలం భూముల క్రమబద్ధీకరణ విషయంలో 1998లో తమ ప్రభుత్వ హయాంలోనే 578జీఓ జారీ అయ్యిందన్నారు. దానికి అనుగుణంగా చాలా మంది క్రమబద్ధీకరణ చేసుకున్నారన్నారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. తిరిగి 2014-19 కాలంలో తమ ప్రభుత్వమే 229 జీఓ జారీ చేసి సింహాచల భూముల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కోర్టులోని కేసు కూడా పరిష్కారం అవుతుందన్నారు. దాదాపు 70 శాతం మందికి న్యాయం చేకూరుతుందన్నారు. అదేవిధంగా భూముల క్రమబద్ధీకరణకు గతంలో తమ ప్రభుత్వం జారీ చేసిన 296, 388 జీఓలను విశాఖపట్నం వాసులే ఎక్కువగా వినియోగించుకున్నారన్నారు.సమావేశంలో విశాఖపట్నం ఎంపీ ఎం శ్రీభరత్, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.