- భారత అంబాసిడర్ మృదుల్ కుమార్‌కు మంత్రి లోకేష్ వినతి
- సీఎం చంద్రబాబుతో కలిసి అంబాసిడర్‌తో మంత్రి లోకేష్ భేటీ
జ్యూరిచ్/దావోస్ (చైతన్యరథం): స్విట్జర్లాండ్‌లో వంద బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన ఫార్మా పరిశ్రమలో భాగమైన నోవార్టిస్, రోచె, లోన్జా, ఆల్కాన్ వంటి దిగ్గజ ఔషధ కంపెనీల యూనిట్లను ఏపీలో ఏర్పాటుచేసేందుకు మీ వంతు సహకారం అందించాలని ఆ దేశంలోని భారత రాయబారి మృదుల్ కుమార్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. జ్యురిచ్‌లోని హిల్టన్ హోటల్లో మృదుల్ కుమార్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలసి మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… స్విట్జర్లాండ్‌లోని ఇంజినీరింగ్, ఐటీ, ఫార్మాస్యూటికల్స్, పారా మెడికల్ రంగాల్లో 27,300 మంది భారతీయులు పనిచేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విదేశీ పెట్టుబడులకు పూర్తి అనుకూలంగా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పారిశ్రామిక పాలసీలను ప్రకటించారు. మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్స్, మిషనరీ, హార్డ్ వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్, రైల్ కాంపొనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా స్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులకు పలు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ఏపీలో స్కిల్ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. ఇందుకు ఏపీ- స్విట్జర్లాండ్ వర్సిటీల నడుమ పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నాం. స్విస్‌లో యూనివర్సిటీ ఆఫ్ జ్యురిచ్, యూనివర్సిటీ ఆఫ్ బాసెల్, యూనివర్సిటీ ఆఫ్ బెర్న్, యూనివర్సిటీ ఆఫ్ జెనీవా వంటి ప్రఖ్యాత వర్సిటీలు ఉన్నాయి. వివిధ రంగాల్లో నిపుణుల సేవల కోసం స్విట్జర్లాండ్ వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పిస్తోంది. కాస్ట్ ఎఫిషియన్సీ, టెక్నికల్ స్కిల్ గ్యాప్‌ను తగ్గించేందుకు ఏపీలో ప్రత్యేకించి మహిళల ప్రతిభ, నైపుణ్యాలను వినియోగించునే అవకాశం ఉంది. ఇందుకు మీవంతు సహాయ, సహకారాలను అందించాలని మంత్రి లోకేష్ కోరారు.
స్విస్ రాయబారి మృదుల్ కుమార్ మాట్లాడుతూ… ప్రస్తుతం స్విట్జర్లాండ్‌కు చెందిన 350కి పైగా కంపెనీలు భారత్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇందులో నెస్లే, ఎబిబి, నోవార్టిస్, యుబిఎస్, క్రెడిట్ స్యూస్, ఓసి ఒర్లికాన్, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్, క్యూన్ ప్లస్ నగెల్, ఫెయిన్ టూల్ వంటి కంపెనీలు ఉన్నాయని తెలిపారు. భారత్‌లోని స్విస్ కంపెనీల ద్వారా 1.3లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించినట్లు చెప్పారు. అలాగే భారత్‌కు చెందిన టిసిఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్, మహింద్రా వంటి కంపెనీలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థలు స్విట్జర్లాండ్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయని, స్విట్జర్లాండ్ ఎఫ్‌డిఐలలో భారత్ కంపెనీల వాటా 4.36శాతంగా ఉందని తెలిపారు. భారత్‌లో 2020-21లో 7.3 శాతంగా ఉన్న స్విస్ ఎఫ్‌డిఐలు… కరోనా, ఇతర కారణాల వల్ల 2023-24 సంవత్సరానికి 1.14 శాతానికి తగ్గిపోయాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో స్విస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి తమవంతు సహకారాన్ని అందిస్తానని మృదుల్ కుమార్ తెలిపారు. ఈ భేటీలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టిజి భరత్, ఎపిఈడిబి సిఇఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.