- బాధ్యత తీసుకున్నపుడు దాన్ని నెరవేర్చాలి
- డ్యూటీలో నిర్లక్ష్యాన్ని అస్సలు సహించను
- అధికారులను నిలదీసిన సీఎం చంద్రబాబు
- సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం
- స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శ
- వైద్యులనుంచి పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం
- మెరుగైన వైద్య సేవలు అందివ్వాలని ఆదేశం
తిరుపతి (చైతన్య రథం): తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు గురువారం పరిశీలించారు. విజయవాడ నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తితిదే ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. ‘‘భక్తుల రద్దీ పెరుగుతుంటే తితిదే అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి. తమాషా అనుకోవద్దు’’ అని వ్యాఖ్యానించారు.
భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు? అని తితిదే జేఈవో గౌతమిని సీఎం నిలదీశారు. జేఈవోగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అంబులెన్స్ లభ్యత గురించి సీఎం ఆరా తీశారు.
అనంతరం స్వివమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు దాదాపు 35మందిని పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెభుతూ, ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. సీఎంవెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో శ్యామలరావు, ఇతర అధికారులు ఉన్నారు.