- నీచే హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పోలో మంత్రి సవిత వెల్లడి
- నేతన్నలకు 365 రోజులు పని కల్పించడమే లక్ష్యం
- సంక్రాంతికి చేనేత వస్త్రాలు ధరిద్దామని పిలుపు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగించేలా ప్రతి నెలా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ సంక్షేమ మంత్రి ఎస్ సవిత వెల్లడిరచారు. ఎగ్జిబిషన్లు, ఎక్స్ పోలు నిర్వహణతో చేనేత వస్త్రాలు విక్రయాలు పెరిగాయాన్నారు. గురువారం విజయవాడలో నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పోను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్ పోలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి, ఏ రాష్ట్రం నుంచి వచ్చారు… అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి..? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ఎంతో కీలకమైన చేనేతకు సీఎం చంద్రబాబు అండగా ఉంటున్నారన్నారు.
నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించడానికి రాష్ట్రంలోనూ, దేశ విదేశాల్లోనూ చేనేత ఎక్స్ పోలు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ వీవర్స్ సర్వీస్ సెంటర్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పోను నిర్వహిస్తున్నామన్నారు. వారంపాటు నిర్వహించే ఎక్స్ పోలో 49 స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంతోపాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, బీహార్‌కు చెందిన 49 మంది చేనేత కార్మికులు, సొసైటీలు స్టాళ్లు ఏర్పాటు చేశాయన్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి దృష్టికి రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలను తీసుకెళ్లినట్లు మంత్రి వెల్లడిరచారు.
చేనేతతో సంక్రాంతిని చేసుకుందాం…
చేనేత వస్త్రాలు తెలుగు సంప్రదాయానికి ప్రతీక అని మంత్రి సవిత అన్నారు. రాబోయే సంక్రాంతికి ప్రజలంతా చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలని పిలుపునిచ్చారు. తెలుగింటి పెద్దపండగ సంక్రాంతిని చేనేతతో జరుపుకుందామన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవాలని మంత్రి సవిత కోరారు.
365 రోజులూ పని కల్పిస్తాం…
చేనేత కార్మికులకు గౌరవ ప్రదమైన జీవనం కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. నీచే హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 35 రకాల నాణ్యమైన చేనేత వస్త్రాలను నేతన్నలను తయారు చేస్తున్నారన్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వ సంస్థ వీవర్స్ సర్వీస్ సెంటర్, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. చేనేతలకు చంద్రబాబు పాలన ఎప్పుడూ స్వర్ణయుగమేనని మంత్రి వ్యాఖ్యానించారు. గడిచిన 6 నెలల కాలంలో మూడు ఆప్కో షోరూమ్‌లను కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 10 క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ సహకారం తీసుకుంటున్నామన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలకు, నేతన్నలకు 365 రోజులపాటు పని కల్పించేలా టాటా సంస్థతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడిరచారు. ఇప్పటికే ఆ సంస్థ ఆధ్వర్యంలో కార్యకలాపాలు ప్రారంభించామన్నారు. త్వరలో 5 శాతం జీఎస్టీ రియింబర్స్‌మెంట్‌కు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆప్కో ఎండీ పావనమూర్తి, వీవర్స్ సర్వీస్ సెంటర్ డీడీ సాహూ తదితరులు పాల్గొన్నారు.